హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ)/అచ్చంపేట: ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల కోసం రోబోలు రంగంలోకి దిగాయి. టన్నెల్ లోపల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో అధికారులు ఈ రోబోలను రప్పించారు. మంగళవారం ఉదయం అన్వి రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులైన విజయ్, అక్షయ్ ఏఐ అధారిత కెమెరా గల మాస్టర్ రోబోతో సహా సొరంగంలోకి వెళ్లి సహాయ చర్యలను ప్రారంభించారు.
110 మంది సహాయక బృందం కూడా లోపలికి వెళ్లింది. మరో మూడు రోబోలను బుధవారం టన్నెల్లోకి పంపించనున్నారు. మాస్టర్ రోబో ద్వారా ఈ మూడు రోబోలు ఆటోమెటిక్‌గా పనిచేసే విధంగా టన్నెల్ బయట కార్యాలయంలో సెటప్ ఏర్పాటు చేశారు. ఒక రోబో మట్టి, బురద, తొలగించనుండగా, మరో రోబో వాటర్‌ను , ఇంకొకటి రాళ్లను తొలగించి చూర్ణంగా మార్చడం, ఇతర పనులు చేపట్టనున్నట్టు బృందం నిపుణులు తెలిపారు.
టన్నెల్లో లోపల మృతదేహాల కోసం కేరళ క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ ర్యాడార్ గుర్తించిన డీ-1, డీ-2 ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. డిజాస్టర్, మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి సొరంగంలో కొనసాగుతున్న సహా య చర్యలను మంగళవారం సమీక్షించారు. టన్నెల్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలతో ఆయన మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలను వారు వివరించారు. సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అన్వి రోబోటిక్స్, హైడ్రా అధికారులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్యూ టీం, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళ కడావర్ డాగ్ స్వాడ్ బృందాల అధికారులు పాల్గొన్నారు.