శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:39:55

లాక్‌డౌన్‌ కాలంలో హైదరాబాద్‌ రోడ్లు సూపర్‌

లాక్‌డౌన్‌ కాలంలో హైదరాబాద్‌ రోడ్లు సూపర్‌

  • జీహెచ్‌ఎంసీ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్‌కు నివేదించిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ రోడ్లు అద్భుతంగా తయారయ్యాయని జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు చెప్పారు. లాక్‌డౌన్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో డిసెంబర్‌ కల్లా 75వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధమవుతాయన్నారు. నగర పరిధిలో ఫుట్‌పాత్‌లు, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లింక్‌రోడ్లు, పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి జీహెచ్‌ఎంసీకి మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పారు. సమావేశంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎల్బీనగర్‌ ఎమ్యెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


logo