రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు కొత్త జిల్లాల ప్రకారం ఏర్పాటైన కొత్త సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లు, సెక్షన్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి కొత్త కార్యాలయాల్లో కార్యకలాపాలు మొదలు కానున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కొత్తరూపును సంతరించుకున్నది. కొత్త జిల్లాల ప్రకారం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన కొత్త సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లు, సెక్షన్లకు సంబంధిం చి ఏయే కార్యాలయాలు ఎక్కడినుంచి కార్యకలాపాలు సాగించాలో నిర్ణయించారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి కొత్త కార్యాలయాల్లో కార్యకలాపాలు మొదలు కానుం డగా.. పెరిగిన సర్కిళ్లు, డివిజన్ల బాధ్యతను ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకే అప్పగించనున్నారు. పదోన్నతులకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల పెంపు కారణంగా ఆర్అండ్బీ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గత జనవరిలోనే పోస్టులను పునర్వ్యవస్థీకరిస్తూ జనవరి 5న ఉత్తర్వులు జారీచేశారు. రెండు చీఫ్ ఇంజినీర్ (సివిల్), ఒక చీఫ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), పది సివిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్, రెండు ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు సహా మొత్తం 472 పోస్టులను ఖరారు చేశారు. తాజాగా చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలతోపాటు సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లు, సెక్షన్ కార్యాలయాలను ఏర్పాటుచేశారు. మొత్తం పోస్టులను 3,371గా నిర్ధారించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న పోస్టులు 2,961కాగా, కొత్తగా 472 పోస్టులను మంజూరుచేశారు. ప్రస్తుతమున్న పోస్టుల్లో 392 హెచ్ఓడీ పోస్టులు కాగా, 2,569 ఫీల్డ్ స్టాఫ్ పోస్టులున్నాయి.
పెరిగిన సర్కిళ్లు
రోడ్లకు సంబంధించి గతంలో తొమ్మిది సర్కిళ్లుండగా, ఇప్పుడు 16 సర్కిళ్లను ఏర్పాటుచేశారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి తదితర ప్రాంతాల్లో సర్కిల్ కార్యాలయాలు కొనసాగుతాయి. భవనాలకు సంబంధించి హెడ్‌క్వార్టర్స్ సర్కిల్, ప్రాజెక్ట్స్ సర్కిళ్లు హైదరాబాద్‌లో ఉంటాయి. జాతీయ రహదారుల విభాగానికి సంబంధించి నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ సర్కిళ్లు ఉంటాయి. క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రికల్‌కు వరంగల్, హైదరాబాద్ సర్కిళ్లు ఉంటాయి. కొత్తగా ఏర్పాటుచేసిన సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లకు సంబంధంచి ఆర్ అండ్ బీకి ఆయా ప్రాంతాల్లో ఉన్న భవనాల్లోనే కార్యాలయాలను ఏర్పాటుచేస్తారు. లేనిపక్షంలో అద్దెభవనాల నుంచి కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు.
32