మొయినాబాద్/ఆదిబట్ల, జూలై 18 : రంగారెడ్డి జిల్లా పరిధి ఆదిబట్ల వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నంబర్-12 వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, దాసరితండాకు చెందిన గుగులోత్ జనార్దన్(45), వరంగల్ జిల్లా, పాకాల కొత్తగూడెం మండలం, మాసంపల్లితండాకు చెందిన మాలోత్ చందూలాల్(29), రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, ఎల్కపల్లి గ్రామానికి చెందిన కావలి బాలరాజు(40), ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, వేదులవలసకు చెందిన దాసరి భాస్కరరావు(39), విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, కలంరాజుపేటకు చెందిన జడ కృష్ణ(25)మొయినాబాద్‌లోని గ్రీన్ వ్యాలీ రిసార్ట్, సోలార్ విల్లాస్‌లో పని చేస్తున్నారు.
వీరంతా కలిసి గురువారం రాత్రి 8:30 గంటలకు మొయినాబాద్ సమీపంలోని ఎన్కేపల్లి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కారులో బయలుదేరారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం తిరిగి ఔటర్‌రింగ్ రోడ్డుపై ఎన్కేపల్లికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డుపై 12వ ఎగ్జిట్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు(టీఎస్ 07 హెచ్‌డబ్ల్యూ 5858)ముందు వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మాలోతు చందూలాల్, కావలి బాలరాజు, దాసరి భాస్కర్‌రావు, గుగులోత్ జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జడ కృష్ణ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.