
వెల్గటూర్, సెప్టెంబర్ 9: స్కూటీని డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో తండ్రి, కూతురు, ఏడాది వయస్సు కొడుకు దుర్మరణం చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్ మండలం కొత్తపేటకు చెందిన కోడిపుంజుల తిరుపతి(36), తన భార్య మనోజ, కొడుకు ఆదిత్య, కూతురు రిషిత(6), అన్విత్(1)తో కలిసి స్కూటీపై ఉదయం ధర్మపురి మండలం దమ్మన్నపేటలో తిరుపతి అత్త మూడు నెలల మాసికానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని సాయంత్రం స్కూటీపై కొత్తపేటకు బయలుదేరారు. పాశిగామ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా, స్కూటీతోపాటు అందరూ ఎగిరిపడ్డారు. వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లడంతో చిన్నారులు రిషిత, అన్విత్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీర భాగాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. పెద్ద కొడుకు ఆదిత్య స్వల్ప గాయాలతో బయటపడగా, భార్యాభర్తలు తిరుపతి, మనోజ అవయవాలు బయటపడి తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తిరుపతి మృతిచెందారు. మనోజ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం
తిరుపతిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కొన్నేండ్లు కరీంనగర్లో మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో ఉన్న ఊళ్లోనే చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. గురువారం అత్త మూడు నెలల మాసికానికి వెళ్లి తమ పెండ్లినాటి ఫొటోను వెంట తీసుకువస్తున్నారు. ఈ ఘటనతో కొత్తపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెదక్ జిల్లాలో మరో ఇద్దరు..
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలలోని శెట్పల్లి గ్రామశివారు వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ట్రాక్టర్-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.