TG whether : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
రాగల రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉంది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.