హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోకి కింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.
రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రెండు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దస్తూరాబాద్ (నిర్మల్) 42.8, కొల్లాపూర్ (నాగర్ కర్నూల్) 42.7, కట్టంగూర్ (నల్లగొండ) 42.6, ఆదిలాబాద్ అర్బన్ 42.6, నేలకొండపల్లె (ఖమ్మం) 42.5, లక్కవరం రోడ్డు (సూర్యాపేట) 42.4, అలంపూర్ (జోగులాంబ గద్వాల) 42.4, వడ్డెమాన్ (మహబూబ్నగర్) 42.2, మల్లాపూర్ (జగిత్యాల) 42.2, తలమడుగులో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏపీలోనూ అనేక జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.