Pollution | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పెరుగుదల నమోదవుతున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్తలు గుర్తించారు. పలుచోట్ల గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్ (పీఎం) 2.5కు పైగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలి టీ ఇండెక్స్) 100కు పైగానే నమోదవుతున్నది. వరంగల్, హనుమకొండలో హైదరాబాద్‌ను మించి రాష్ట్రంలోనే అత్యధిక ఏక్యూ ఐ నమోదవుతున్నది. వరంగల్‌లో అత్యధికంగా ఏక్యూఐ 143 నమోదైంది. పీఎం 2.5 స్థాయిలో క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు కాలుష్య నియంత్రణ బోర్డు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రమాదంలో హైదరాబాద్ వాసులు
హైదరాబాద్ సహా నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ ఏక్యూఐ 110 కన్నా ఎకువగానే నమోదు అవుతున్నట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగరం లో ఏక్యూఐ 128 నమోదు అవుతున్నది. నగరంలోని సనత్ 125, రాజేంద్రనగర్ మేడ్చల్ 120, జీడిమెట్ల 116, పటాన్ 114 మేర ఏక్యూఐ నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో తక్షణమే గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేకుంటే ఢిల్లీ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉన్నదని పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎం పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు.