కరీంనగగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పశువుల మేతకు ఉపయోగపడే వరి గడ్డిని గతంలో అన్నదాతలు ప్రాణప్రదంగా భావించేవారు. పోచ.. పోచ జమచేసి కుప్పేసి ఏడాదంతా పశువులకు మేతగా వాడేవారు. ఆధునిక వ్యవసాయం, పశువుల సంఖ్య తగ్గడంతో ప్రస్తుతం గడ్డిని మడిలోనే తగుల బెడుతున్నారు. తద్వారా తమ ప్రాణానికి హాని చేసుకోవడంతోపాటు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారు. కాల్చడం వల్ల అపార నష్టాలున్నయంటూ శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా మెజార్టీ రైతులు వరికొయ్యలు, గడ్డిని తగుల పెడుతూనే ఉన్నారు. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాతలు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. పంటకు మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోవడమేకాదు, సారవంతమైన భూమి దెబ్బ తింటుంది. దిగుబడిపై ప్రభావం చూపుతుంది. వాతావారణం కలుషితం అవుతుంది. ఒక్కోసారి రైతులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి చర్యలతో వరి కొయ్యలే సిరులు కురిపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
వరి కొయ్యలను తగుల పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఉత్తర భారత్లో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఇలా తగలబెట్టడం వల్ల నేలలోని పోషక గుణాలు నష్టపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతున్నాయని, తద్వారా పంటకు వేసే ఎరువులు మొక్కలకు అందకుండా పోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ వెలువడి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది.
వరి కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగల బెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దున్నటం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో వర్షపు నీరు నేలలోకి ఇంకిపోతుంది. దీంతో నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి.
వరి కొయ్యలు తగులబెట్టగా దట్టమైన పొగలు వ్యాపించి ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురానికి చెందిన గుండు కనకయ్య (57) గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. శనివారం ఉదయం పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో వెంపలి మండలతో ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పొగకు ఊపిరాడక పొలంలోనే కనకయ్య ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రమైనా కనకయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు.