హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్‌లో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ జీవో-24ను విడుదల చేసింది. మూడు కోర్సులు, 180 సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త క్యాంపస్ అందుబాటులోకి రానున్నది. ఈ క్యాంపస్‌లో ప్రారంభించే మొత్తం కోర్సులు సీఎస్ఈ కోర్సులే కావడం గమనార్హం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(ఏఐఎంఎల్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డాటాసైన్స్) కోర్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో కోర్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీలో మూడు సీఎస్ఈ కోర్సులనే ప్రవేశపెట్టారు. ఒక్క కోర్ కోర్సును కూడా ప్రవేశపెట్టలేదు. దీంతో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బదులు కోర్ ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెడతామన్న సర్కారు హామీ ఉత్తదే అయ్యింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోనూ ఆర్జీయూకేటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా.. ప్రసుత్తం ఈ ప్రతిపాదనలను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో ఆగమేఘాల మీద బుధవారం మహబూబ్‌నగర్‌కు కొత్త ఆర్జీయూకేటీని మంజూరుచేస్తూ జీవో జారీచేసింది.