హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డీ కుమారస్వామితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంట్ను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ పరిశ్రమ కొన్నేండ్లుగా మూతపడిందని, దీంతో కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో కార్మిక నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఏప్రిల్ 2న ఢిల్లీ రానున్నదని, వారు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు.