హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం నిర్వహించే ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
ఆ ఎత్తులో తెలంగాణ ప్రాంతంలోనూ 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. దీంతోపాటు కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో ఆరేడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎకువ అవుతుందన్న ఆందోళన ఉన్నది.
దుమ్మగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండటంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సర్వే చేయించి డీమారేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. జాయింట్ సర్వేకు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రధాని మోదీ ప్రగతి సమావేశంలో చర్చించనున్నారు.