బంజారాహిల్స్,డిసెంబర్ 24: బంజారాహిల్స్‌లో సుమారు ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించడంతో అధికారుల్లో చలనం మొదలైంది. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పీ పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో సుమారు 5 ఎకరాల స్థలంలో పార్థసారథి అనే వ్యక్తి తిష్టవేశాడని, బోగస్ పత్రాలతో ప్రభుత్వ విభాగాలను తప్పుదోవ పట్టిస్తూ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నాడంటూ ‘నమస్తే’ ప్రచురించిన కథనాలతో కలకలం రేగింది. ఢిల్లీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ స్థలాన్ని ఆక్రమించే యత్నం ఈ కథనాలతో వెలుగు చూసింది. వరుస కథనాలతో అప్రమత్తమైన అధికారులు సోమవారం తెల్లవారుజామునే ఆ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలోనూ రెండుమూడుసార్లు ఏర్పాటు చేసినా పార్థసారథి అనుచరులు వాటిని తొలగించిన విషయాన్ని కూడా ‘నమస్తే’ తన కథనంలో పేర్కొంది.
దీంతో షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి మంగళవారం క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోజూ రెండుగంటలకోసారి ప్రభుత్వ స్థలంలోకి వెళ్లి నిఘా పెట్టాలని, ప్రైవేటు వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో మంగళవారం ఉదయాన్నే వారు అక్కడికి వెళ్లి ప్రైవేటు వ్యక్తులను హెచ్చరించడంతో అక్కడున్న ఆరుగురు వెళ్లిపోయారు. అక్కడున్న వంట సామగ్రి, వాటర్ డ్రమ్ములను తొలగించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి పార్థసారథి కుమారుడి సూచనలతోనే వారు అక్కడ తిష్టవేసినట్టు తెలిసింది. ఈ స్థలంతో పార్థసారథికి ఎలాంటి సంబంధం లేకున్నా బోగస్ పత్రాలతో ఏమార్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లను ఉపయోగించుకుని స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. కబ్జాకు పాల్పడిన నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విజిలెన్స్ విభాగం నిఘాలో జలమండలి స్థలం
పార్థసారథి ఆక్రమణలో ఇప్పటిదాకా ఉన్న జలమండలికి కేటాయించిన 1.2 ఎకరాల స్థలాన్ని రక్షించుకోవడంలో ఏ మాత్రం అలసత్వం వహించినా తీవ్ర చర్యలు తప్పవని ఈ నెల 20న జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి జలమండలి విజిలెన్స్ విభాగం తరపున నిఘా ఏర్పాటు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను జలమండలి స్థలంలో విధుల్లో నియమించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులు జలమండలి స్థలంలో రాకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా స్థలంలోకి వస్తే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని అదేశించారు.
ప్రభుత్వస్థలంలోకి వస్తే క్రిమినల్ చర్యలు: అనితారెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పీలో ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని, దీనిలో 1.2 ఎకరాల స్థలాన్ని జలమండలికి కేటాయించగా మిగిలిన స్థలంలోకి అక్రమంగా ఎవరు ప్రవేశించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి హెచ్చరించారు. స్థలంలోకి ప్రైవేటు వ్యక్తులు రాకుండా చూడాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, ప్రతి రెండుగంటలకు ఒకసారి స్థలాన్ని పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు.