హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ (Telangana) స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతియేటా పెరిగిన రాష్ట్ర రెవెన్యూ రాబడులు కాంగ్రెస్ (Congress) పాలనలో మాత్రం ఏటికేడు తగ్గుముఖం పడుతున్నాయి. కేసీఆర్ (KCR) కాలంనాటి వ్యవస్థలే ఉన్నప్పటికీ ఆమ్దానీ మాత్రం తిరోగమనంలో ఉన్నది. ప్రస్తుతం కొవిడ్ సంక్షోభం నాటి దారుణ పరిస్థితులేమీ లేకపోయినప్పటికీ రాష్ట్ర ఆదాయాలు మాత్రం కొవిడ్ నాటి రాబడికి సమీపంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లో రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాల్లో కనీసం 33% దాటలేదు. నిరుడు కూడా ఈ రాబడులు 34% మించలేదు. కానీ, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2022-23లోని తొలి 6 నెలల్లో 38 శాతం, 2023-24లోని తొలి 6 నెలల్లో 40.27 శాతం రెవెన్యూ రాబడులు వచ్చాయి. ఈ లెక్కలు బీఆర్ఎస్ నేతలు చెప్పినవి కావు.
రాష్ట్ర ఆదాయ-వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజాగా విడుదల చేసిన అర్ధవార్షిక (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) నివేదికలోని లెక్కలు. ‘కాగ్’ గణాంకాల ప్రకా రం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల ద్వారా రూ.2,21,242.23 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన రేవంత్రెడ్డి సర్కారుకు తొలి 6 నెలల్లో రూ.75,454.41 కోట్లు (34.10 శాతం) మాత్రమే వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720.62 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని అంచనా వేయగా.. సెప్టెంబర్ నాటికి రూ.76,940.95 కోట్లు (33.49%) మాత్రమే వచ్చింది. తెలంగాణకు కొవిడ్ సంక్షోభ సమయంలో (2020-22 మధ్య కాలంలో) మినహా ఇంత తక్కువ ఆదాయం ఎన్నడూ రాలేదు.
నాడు 47.28 శాతం.. నేడు 40.97 శాతమే
రాష్ర్టానికి వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. వీటినే రెవెన్యూ రాబడులు అంటారు. పన్ను రాబడి (ట్యాక్స్ రెవెన్యూ)లో జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తదితరాలు ఉంటాయి. వీటిని రాష్ట్ర సొంత ఆదాయ వనరులుగా పరిగణిస్తారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సొంత రాబడిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. రేవంత్రెడ్డి పాలనలో దారుణంగా కిందికి దిగజారింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో ట్యాక్స్ రెవెన్యూ వార్షిక లక్ష్యంలో 42.22 శాతానికి చేరింది. ఇదే సమయానికి 2020-21లో 31.19 శాతం, 2021-22లో 42.90 శాతం, 2022-23లో 47.28 శాతం, 2023-24లో 43.73 శాతం ఆదాయం సమకూరింది. రేవంత్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక 2024-25 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో 41.91 శాతంగా ఉన్న రాష్ట్ర పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 40.97 శాతానికి దిగజారింది. హైడ్రా, ఫ్యూచర్ సిటీ, మెట్రో రద్దు తదితర అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతోపాటు రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
