హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ) : ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్(ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్)ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. ఆధార్ మాదిరిగానే ప్రతి సర్వే నంబర్‌కు భూధార్ నంబర్ ఇస్తామని చెప్పారు.