హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, కొండగల్ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై లగచర్లలో సోమవారం జరిగిన దాడిని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా విధులు బహిషరించాలని నిర్ణయించినట్టు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ తెలిపారు.
దాడి హేయమని టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేశ్, సెక్రటరీ జనరల్ ఫూల్సింగ్హాన్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, లక్ష్మణ్ (రంగారెడ్డి జిల్లా) శివకుమార్ (వికారాబాద్ జిల్లా) డిమాండ్ చేశారు. లగచర్లలో అధికారులపై దాడిని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ ఖండించారు. దాడి నీతిమాలిన చర్య అని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి సుభాకర్రావు అభివర్ణించారు.
వికారాబాద్ : కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై రైతుల దాడిని నిరసిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. అన్నిశాఖల అధికారులు వికారాబాద్ కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నాకు దిగారు. అనంతరం అక్కడికి చేరుకున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ తనపై ఎలాంటి దాడి జరగలేదని, ఉద్యోగులు ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు. ధర్నాలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో వాసుచంద్ర, డీఈవో రేణుకాదేవి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి: కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను సోమవారం సాయంత్రం డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షురాలు రాధ, పూల్‌సింగ్ కలిశారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. తదుపరి కార్యాచరణపై వారు చర్చించినట్టు తెలిసింది.
అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మల్టీజోన్-2 ఐజీపీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వికారాబాద్, బొంరాస్‌పేట ఠాణా పరిధి, దుద్యాల మండలం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు వెళ్లారని చెప్పారు.
లగచర్లలో వేదికను ఏర్పాటు చేయగా 11గంటల నుంచి 12:10 గంటల వరకు అక్కడికి రైతులు రాలేదని అదే సమయంలో గ్రామానికి చెందిన సురేశ్ కలెక్టర్ వద్దకు వచ్చి ‘గ్రామంలో టెంట్ ఏర్పాటు చేశాం.. అక్కడికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి’ అని చెప్పడంతో కలెక్టర్ అధికారులు వెళ్లారు. వారిని గ్రామస్తులు తోసేశారని, కలెక్టర్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీపై దాడి చేశారని చెప్పారు. ప్రాణాపాయం లేదని తెలిపారు.