Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కాంగ్రెస్సే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ప్రతీకారంగానే ఢిల్లీ పరిణామాలు చోటుచేసుకున్నట్టు చెప్పారు. ఆదివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సొంతపార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమలు చేయని పనులను చేస్తున్నట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ‘హర్యానాలో కేజ్రీవాల్ డిస్టర్బ్ చేశారు. కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే ఢిల్లీలో కాంగ్రెస్ చేయాల్సినంత చేసింది. అంతిమంగా రెండు రాష్ర్టాల్లో బీజేపీకి లబ్ధి చేకూరింది’ అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీ పరస్పర లబ్ధి కోసం పనిచేస్తున్నాయని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌లో క్షేత్రస్థాయి నేతలు ఢిల్లీ పెద్దలను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా మోదీకి ఓటేయాలన్నట్టుగా ప్రచారం చేస్తారని తెలిపారు. కానీ కాంగ్రెస్‌లో జాతీయ నాయకులను పట్టించుకోకుండా స్థానిక నాయకుల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుండటంతో వరుస ఓటములు కలుగుతున్నాయని తెలిపారు.
అమలు చేయకున్నా.. చేసినట్టు ప్రచారం
రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు రూ.12 వేలు ఆర్థిక సాయం ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.5 లక్షలు ఇస్తున్నామని కేరళ పర్యటనలో రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రకటించిందే తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అయినా అమలు చేసినట్టు ప్రకటించుకోవడంపై రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుభరోసా కింద కూడా ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఒక విడత రైతుభరోసా పూర్తిగా ఎగ్గొట్టి, మరోవిడత అరకొరగా ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం ఏమిటని రైతుసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లి గొప్పలు చెప్పుకోవడం రేవంత్‌రెడ్డికి బాగా అలవాటయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
పీవీకి అవమానం జరగలేదట!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన తర్వాత కాంగ్రెస్ ఏ స్థాయిలో అవమానించిందో దేశ ప్రజలందరికీ తెలిసిందే. కానీ పీవీని కాంగ్రెస్ అవమానించలేదని రేవంత్‌రెడ్డి వెనుకేసుకొచ్చారు. ఇదంతా ప్రధా ని నరేంద్రమోదీ, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన అపోహ అంటూ కొట్టిపారేశారు. కేవలం సర్పంచి స్థాయిలో ఉన్న పీవీ నరసింహారావుకు అవకాశాలు ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చి, ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌దని చెప్పుకొచ్చారు. తనకు పీవీ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలే మండిపడుతున్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించినప్పుడు రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ పార్థివ దేహాన్ని కనీసం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి రానివ్వలేదని, ఢిల్లీలో అంతక్రియలు చేయనీయలేదని గుర్తుచేశారు. అధిష్ఠానం దగ్గర తన పరపతిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని నిలదీస్తున్నారు.
నాన్న పార్థివ దేహానికి కనీస మర్యాద ఇవ్వలేదు ; ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆవేదన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీప్రధాని పీవీ నర్సింహారావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను, ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెకించిన నేతగా పీవీ నరసింహారావును ప్రజలంతా గౌరవిస్తారని తెలిపారు. సృష్టిలో మనిషి పుట్టుక, చావే విలువైనవని, నాన్నగారి అంతిమ సంస్కారంలో కాంగ్రెస్ చేసిన సంస్కారహీనమైన ప్రవర్తన ఒక గాయంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పీవీ పార్థివ దేహానికి కూడా కాంగ్రెస్ కనీస మర్యాద ఇవ్వలేదని అన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి రానీయకుండా, తలుపులు మూయించి, ఆయనకు చేసిన అవమానాన్ని దేశ ప్రజలు మర్చిపోరని, పీవీ పిల్లలుగా తమ జీవితంలో ఇంతకంటే దారుణమైన ఘటన ఏమీ ఉండదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా హైదరాబాద్‌కు పంపించివేశారని, హైదరాబాద్‌లో అయినా గౌరవంగా కార్యక్రమాలు చేశారా అంటే అదీ లేదని ఆనాటి ఘటనను గుర్తుచేసుకొని బాధపడ్డారు. మనోవేదననే కాంగ్రెస్ పీవీకి, తమకు ఇచ్చిందన్నారు. పీవీకి పదవుల మీద ఆశ లేదని, తాను సన్యాసం తీసుకుని పీఠాధిపతి కావాలనుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక పీవీని బతిమిలాడుకుంటే పార్టీకి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. రాజకీయాల కోసం పీవీ నర్సింహారావు పేరు తీస్తూ తమ గుండె గాయాన్ని పదే పదే గుర్తుచేయవద్దని, ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.