సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి : తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు, నిర్బంధాలు చేశారు. కొత్తగా అభివృద్ధి చేయలేక… బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగించలేక చతికిలపడ్డ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశ్నించే వారి పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తిరుమలగిరిలో సభకు రేవంత్‌రెడ్డి రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.
సోమవారం మీటింగ్ ఉండగా, ఆదివారం మధ్యాహ్నం నుంచే ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. సూర్యాపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, యువజన నాయకుడు ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం వరకు ఉంచారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో వచ్చిన సాగునీళ్లు ఇప్పుడెందుకు రావట్లేదో.. తిరుమలగిరి సభలో సీఎం చెప్పాలని డిమాండ్ చేసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. పెద్దఎత్తున పోలీసులు కిశోర్ ఇంటిని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని, అంతా గాలికి వదిలేసి అరెస్టుల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది రాక్షస పాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.