హిమాయత్‌నగర్, జనవరి 7 : మాలలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాలుకా రాజేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదర్‌గూడలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన మాలలను అణచివేసి, గొంతు నొక్కేందుకు రే వంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేసి ఓపెన్ క్యాటగిరీలో లేని రోస్టర్ పాయింట్లను మాలలకు అంటగట్టడం అత్యంత దుర్మార్గమని వారు మండిపడ్డారు.
బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో సీఎం రేవంత్‌రెడ్డి మాలలకు శాశ్వతంగా రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రయత్నించడం తగదని ధ్వజమెత్తారు. గ్రూప్-1లో 15 కులాలు, గ్రూప్-2లో 18 కులాలు, గ్రూప్-3లో 26 కులాలు ఉండగా గ్రూ ప్-3లో రోస్టర్ పాయింట్‌ను 26 పెట్టడమనేది రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ పాయింట్లపై మౌనం వీడి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను 16కు సవరించాలని లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.