Revanth Reddy | న్యూఢిల్లీ, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : ఎవరినైనా ఏదైనా వివరణ అడిగితే.. స్పష్టత ఇస్తారు. కానీ అడగకుండానే పిలిచిమరీ వివరణ ఇస్తే.. కొత్త అనుమానాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇలాంటిదే ఓ చర్చ నడుస్తున్నది. ఢిల్లీకి 39వసారి వెళ్లిన రేవంత్‌రెడ్డి, విదేశాంగమంత్రి జైశంకర్‌తో సమావేశమైన తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. రాజకీయాలపై పలు అభిప్రాయాలు వెలిబుచ్చారు. సోనియాగాంధీ కుటుంబంతో తనకు చాలా అనుబంధం ఉన్నదని చెప్పుకున్నారు. ఇది నిరూపించుకోవడానికి ఫొటోలు చూపించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. అయితే కనీసం ఈ సారైనా అధిష్ఠానం పెద్దలెవరితోనైనా సమావేశమయ్యారా? అపాయింట్మెంట్ దొరికిందా? అనే ప్రశ్నలు ఎవరైనా అడుగుతారని భావించారో ఏమో..! అందుకే తాను సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరి మనిషిని అని,అధిష్ఠానంతో అనుబంధం ఉన్నదని చెప్పుకున్నారు. అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇటీవల ఢిల్లీలో పడిగాపులుకాసినా రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం పెద్దలెవరూ అపాయింట్మెం ట్ ఇవ్వడంలేదని కాంగ్రెస్‌లోనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధిష్ఠానమే రంగంలోకి దిగినట్టు స్పష్టమవుతున్నది. సీఎం సిఫారసు చేసిన ప్రతిపాదనలు, ముఖ్యం గా తనకు అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు వేం నరేందర్‌రెడ్డికి కూడా అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. సీఎం, హైకమాండ్ మధ్య గ్యాప్‌పై స్పష్టత వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్, గల్లీలో కాంగ్రెస్ భిన్నవాదనలు వినిపిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నా యి. రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్ అంటకాగడమే ఇందుకు నిదర్శనమే వి మర్శలు ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మోదీ తో, కేంద్రమంత్రులతో సఖ్యతగా సమావేశం కావడం, రాష్ట్రంలో బీజేపీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉన్నదేమో అన్నంతగా స్నేహ సంబంధాలు నెరుపుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న రేవంత్ పదేపదే మోదీ నామస్మరణ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే రేవంత్ ఇలా మాట్లాడారనే ఆరోపణలున్నాయి. గుజరాత్లో కాంగ్రె స్ నేతల సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్య లు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో రెండు రకాల వాళ్లు ఉన్నారని, కొందరు కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్లు కాగా, మరికొందరు కాంగ్రెస్‌లో ఉన్నా మనసంతా బీజేపీలో ఉంటుందని విమర్శించారు. అలాంటివాళ్లను బహిష్కరిస్తామ ని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలు రేవంత్‌ను ఉద్దేశించి చేసినవేననే ప్రచారం జరిగింది. అందుకేనేమో గురువారం ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ తాను ఎవరి ట్రాప్‌లోనూ పడబోనని వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు ఎటువంటి ప్రచారం చేసినా ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అడగకుండా ఇచ్చిన వివరణ కొత్త అనుమానాలకు తావిస్తున్నది. రాహుల్ వ్యాఖ్యలతో రేవంత్ గుండెజారి గల్లంతయ్యిందేమోనని, అందుకే వివరణ ఇచ్చుకుని ఉంటారని పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఏడాది పాలనలో నిరుద్యోగా న్ని 8.8 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించగలిగానని చిట్‌చాట్‌లో రేవంత్ చెప్పుకొచ్చారు. రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినట్టు వ్యాఖ్యానించారు. రాష్ర్టానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రివర్గంలో ఉన్నారని, కానీ ప్రాజెక్టులు సాధించాలని కోరితే పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో ఏప్రిల్‌లో మూడు రోజులపాటు ‘భారత్ సమ్మి ట్’ పేరుతో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసమే విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ అయినట్టు వివరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత చెన్నైలో డీఎంకే నిర్వహించే మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.