హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సరారు బడుల పరిశుభ్రతకు నాలుగు నెలలు ఆలస్యంగా రేవంత్ సరారు నిధులు కేటాయించింది. బడులు ప్రారంభమైన రెండు నెలల తర్వాత పాఠశాలల పరిశుభ్రత బాధ్యత ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కేవలం పరిశుభ్రత నిర్వహించేవారికి గౌరవ భత్యం చెల్లించడానికి మాత్రమే ఆ గ్రాంటు నిధులను వాడాలని తెలిపింది. పరిశుభ్రత కోసం పనిచేసే వారి పేరు ఎకడా ఉండరాదని, కమిటీ పేరు మీదనే చెల్లించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వుల్లో పేరొన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు నెలవారీగా పరిశుభ్రతకు గ్రాంటును కేటాయించారు. కనిష్టంగా రూ.3 వేలు, గరిష్టంగా రూ.20 వేల చొప్పున పది నెలల పాటు గ్రాంటు ఇవ్వనున్నారు. మార్చిలో ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పారిశుధ్య కార్మికులను నియమించాలని సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. అదే సభలో సీఎం రేవంత్‌రెడ్డి పారిశుధ్య కార్మికులను నియమిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. ఇటీవలే ఎల్బీ స్టేడియంలో టీచర్లతో ముఖాముఖి నేపథ్యంలో ‘సీఎం హామీ నీటి మూటలేనా’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన సీఎం రెండు రోజుల్లోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది.
గతంలో 28 వేల ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులకు ఔట్ సోర్సింగ్ సర్వీస్ పర్సన్స్ పేరిట 28 వేల మంది వరకు పనిచేసేవారు. వీరికి గౌరవ వేతనం రూ.2500 ఇచ్చేవారు. కరోనా సమయంలో విద్యాసంస్థలు మూసివేయడంతో వీరిని తొలగించి, పంచాయతీరాజ్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖలు సమర్థవంతంగా నిర్వహించకపోవడంతో టీచర్లే సావెంజర్లను నియమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. గ్రాంటు నిధులపై పీఆర్టీయూ, టీజీ యూటీఎఫ్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, జంగయ్య, పర్వత్ రెడ్డి, కార్యదర్శులు బీరెల్లి కమలాకర్‌రావు, చావా రవి, సదానందం గౌడ్ వర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.