హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ‘మిస్ వరల్డ్ 2025’ పోటీల్లో పాల్గొనే అందాల భామలకు ఎక్కడా, ఎలాంటి అసౌకర్యం కలగకుండాచూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్లో రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం మొదలు కంటెస్టెంట్లు బస చేసే హోటళ్లు, పోటీలు జరిగే వేదికల వరకు ప్రతిచోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చారిత్రక, పర్యాటక ప్రదేశాలను కంటెస్టెంట్లు సందర్శించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.