హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడ్డారని నెటిజ న్లు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి అయి ఉండీ ఒక నటుడితో ఫొటో కోసం ఆయన అంగలార్చి రాష్ట్రం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు రేవంత్‌రెడ్డి ఇటువంటి అపఖ్యాతి మూటకడతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హుందాతనం ఎలా ఉంటుందో కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని, గతంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్, కేసీఆర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
గురువారం ముంబైలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే మనవరా లి పెళ్లి వేడుకలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా పట్టించుకోకుండా ఆయన ముంబై వెళ్లారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ షూటింగ్లో ఉన్నారని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి, తెలంగాణలో సినీ పరిశ్రమ వ్యవహారాలు చూస్తున్న రోహిన్‌రెడ్డిని పురమాయించి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే, షూటింగ్ మధ్యలో ఆపడం సాధ్యం కాదని, మరోసారి ఎప్పుడైనా కలుద్దామని సల్మాన్ మర్యాదపూర్వకంగా చెప్పినట్టు తెలిసింది. అయితే షూటింగ్ ముగిసేంత వరకు సీఎం సార్ వెయిట్ చేస్తారని, తమరు అనుమతిస్తే ఆయనే బిగ్‌బాస్ షూటింగ్ స్పాట్‌కు వచ్చి ఫోటో దిగి వెళ్తారని చెప్పినట్టు తెలిసింది. దీంతో సల్మాన్‌ఖాన్ అయిష్టంగానే అంగీకరించి ఆయనతో ఫోటో దిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సల్మానే కలిసినట్టు కలరింగ్
సీఎం సూచన మేరకు సీఎంవో కార్యాలయం సల్మాన్‌తో రేవంత్‌రెడ్డి దిగిన ఫోటోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది. షిండే మనవరాలి పెళ్లి వేడుకలకు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు హాజరయ్యారని, ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటు మీద చాలా ఆసక్తిగా మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఫోటో బ్యాక్ గ్రౌండ్‌ను పరిశీలిస్తే బిగ్‌బాస్ షూటింగ్ స్పాట్లో ఫొటో దిగినట్టు స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.