హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద (MLA K.P. Vivekananda ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలతో (Foreign trips) పెట్టుబడులు రాబోతున్నాయని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో అమెరికా (America) ,దావోస్ ( Davos) పర్యటనలతో పెట్టుబడులు తెచ్చామని ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజమని ఆరోపించారు. అదానీ (Adani) కంపెనీ నుంచి రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 862 కోట్లు మాత్రమే తీసుకొచ్చిందని వివరించారు. ఫార్మా సిటీ (Pharma City) , ఎయిర్ పోర్ట్ మెట్రో, ఫార్ములా ఈ రేస్ రద్దు చేసిన సీఎం నిర్ణయం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వస్తుందని ఆరోపించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేక పోవడంతో రాష్ట్రం నుంచి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని వెల్లడించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారు. దేవుళ్లపై ప్రమాణం చేసి రుణమాఫీ అని రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
అదాని పెట్టుబడులు అనుమానస్పదమే
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల వచ్చాయని చెప్పుకుంటున్న రూ. 40,232 కోట్ల పెట్టుబడుల్లో అసలు నిజాలు ఏమిటి ? అదాని సంస్థలకు చెందిన రూ. 12,400 కోట్ల పెట్టుబడి అనుమానాస్పదంగానే ఉందని స్పష్టం చేశారు. గోడి కంపెనీ రూ. 160 కోట్ల విలువ చేసే ఒక చిన్న షెల్ కంపెనీ తెలంగాణలో రూ. 8,000 కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుందనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించిన రూ. 9,000 కోట్ల పెట్టుబడి, వెబ్ వర్క్స్ సంస్థ ప్రకటించిన రూ. 5,200 కోట్ల పెట్టుబడి, గోద్రెజ్ సంస్థ ప్రకటించిన రూ. 1,270 కోట్ల పెట్టుబడిలో రూ. 300 కోట్లు గత బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనని తెలిపారు. అప్పటి పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ చొరవతో టాటా గ్రూప్, గోద్రెజ్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని గుర్తు చేశారు.