హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటా పేరిట రేవంత్‌రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలోనే ఉన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ , బీసీ కన్నా బీహారే ముఖ్యమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42 శాతం కోటా అమలు చేస్తారనే నమ్మకం రాహుల్, ఖర్గేతోపాటు తెలంగాణ ప్రజలకూ లేదనే విషయం ఈ ధర్నాతోనే స్పష్టమైందని పేర్కొన్నారు. ‘మేం గుజరాత్లో అడగలేదు, ఉత్తరప్రదేశ్‌లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు. తెలంగాణలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం’ అని రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్‌గాంధీ ‘ఈ పోరాటం తెలంగాణ కోసమే కాదు, యావత్తు దేశం కోసం చేస్తున్న పోరాటం’ అని ట్వీట్ చేశారని గుర్తుచేశారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో రెండు నాలల ధోరణి చూస్తేనే అర్థమవుతున్నదని మండిపడ్డారు.