హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అరెస్టులు, కేసులు, జైళ్లకు బెదిరేది లేదని బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ మంత్రులు స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల అమలు డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే అరెస్టులని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇష్టానుసారం కేసులు పెడ్తామంటే ఊరుకునేది లేదని, అవసరమైతే జైలుభరో కార్యక్రమాలకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు దయతలిస్తే సీఎం అయ్యాననే సంగతిని రేవంత్‌రెడ్డి మరచిపోవద్దని హితవు చెప్పారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొడంగల్‌లో పది నెలలుగా తమ భూములు ఇవ్వబోమని రైతులు చెప్తున్నా వినకుండా ప్రభుత్వం వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు భూములు ఇవ్వవద్దని రైతులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. కానీ, ఇవ్వాళ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆటంకమని, ప్రజలను రెచ్చగొడుగుతున్నదని, కుట్రలు చేస్తున్నదంటూ అదే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యకర్తలు, నరేందర్‌రెడ్డికి, నరేందర్‌రెడ్డి.. కేటీఆర్‌కు ఫోన్ చేశారని అందువల్ల ఇందులో కుట్ర ఉన్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అభాండాలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫోన్లు చేయడమే ప్రామాణికం అయితే కేటీఆర్ కూడా డీజీపీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారని, మరి డీజీపీని కూడా అరెస్టు చేయాలా? అని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల అమలు కోసం కేటీఆర్, హరీశ్‌రావు నిలదీస్తుంటే తట్టుకోలేక సీఎం డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్‌ను ఎట్లయినా అరెస్టు చేయాలనే ఫోబియా సీఎంకు పట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఫార్ములా-ఈ రేసులో ఏమీలేదని తేలిపోవటంతో లగచర్లలో రైతుల తిరుగుబాటుకు కుట్ర కోణం ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తే ప్రశ్నించరని అనుకుంటే పొరపాటని, ఒక్కరిని అరెస్టు చేస్తే వందల మంది ప్రశ్నిస్తరని చెప్పారు. ప్రతి ఊరికో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని హెచ్చరించారు.
రైతుల కడుపుమంటకు సీఎం రేవంత్‌రెడ్డే కారణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. లగచర్ల అనంతర పరిణామాల్లో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. లగిచర్ల ఘటనలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ సహా అధికారులపై జరిగిన దాడిని తాము ఖండించామని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఇటువంటి ఉదంతాలున్నాయా? అని ప్రశ్నించారు.
2014 నుంచి 2023 వరకు వేలాది ఎకరాల భూమని కేసీఆర్ ప్రభుత్వం సేకరించిందని, ఎక్కడా ఏ చిన్న సంఘటన జరగలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో భూ సేకరణ కోసం బలవంతంగా భూములు గుంజుకున్నారని ఎక్కడైనా అన్నారా? అని ప్రశ్నించారు. భూసేకరణ విషయంలో కేసీఆర్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. లగిచర్ల ఘటనతో రేవంత్ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు.