బెజ్జూర్, జూలై 16: సీఎం రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి.. 50 యూరియా బస్తాలను కూడా తీసుకురాలేదని, యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లోని సహకార సంఘం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యారియాను రైతులకు సరఫరా చేయకుండా దళారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీంతో యూరియా దొరక్క రైతులు పొలం పనులు వదిలి ఎరువుల కోసం తిరగాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే అదునుగా దళారులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఇటీవల వరదలతో ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.