Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చూపు ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వైపు నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వైపు మళ్లింది. గతంలో ఆయన ప్రతి దానికీ బీజేపీ నేతల మాదిరిగా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామా? అంటూ ప్రత్యర్థుల మీద సవాల్ విసిరేవారు. భాగ్యలక్ష్మి ఆలయం లాంటి సున్నిత ప్రదేశాలను రాజకీయ సవాళ్లకు వేదికలుగా మలుచుకుంటే రాజకీయంగా మేలు జరుగుతుందనేది బీజేపీ వ్యూహం. అలాంటి ప్రదేశాలను వెదికి మరీ ప్రమాణాల పేరుతో హడావుడి చేయడం బీజేపీ నేతలకు పరిపాటి. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ మూలాలు ఉన్న వ్యక్తిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయవద్దంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ గతంలో సోనియాగాంధీకి రాసిన లేఖ ఒకటి ఆలస్యంగా బయటపడింది. తన మూలాలపై మరింత రచ్చ జరగకముందే జనం దృష్టిని మరల్చే లక్ష్యంతో ఆయన చూపు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వైపు మళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేసిన తరువాత దానిపై స్పందించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనూ తొలుత రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం ప్రస్థావన తీసుకొచ్చి ఆ వెంటనే మాట మార్చడం గమనార్హం. ఆలయం అంటే కొందరికి, మసీదు అంటే మరికొందరికి నచ్చకపోవచ్చు. కాబట్టి గన్‌పార్కు వద్ద ప్రమాణం చేద్దామంటూ మాటమార్చేశారు. అంతేకాకుండా రెండు రోజుల కిందట గన్‌పార్కు వద్దకు పోయి గతంలో భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర చేసిన మాదిరిగానే నానా హంగామా చేయడం గమనార్హం.