Congress | జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): గత కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగానే మంగళవారం ప్రాజెక్టుపైకి దండయాత్రకు శ్రీకారం చుట్టింది. రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలు సర్వసాధారణం. కానీ, ఇక్కడ కేవలం అవినీతిపైనే విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం ఇప్పటివరకు టెక్నికల్‌గా ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగడంపై సీడబ్ల్యూసీకి ప్రభుత్వం లేఖలు రాయగా, ఇప్పటి వరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గానీ, సభ్యులుగానీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. అలాగే ఎన్డీఎస్ఏ నుంచి ప్రత్యేకంగా బరాజ్‌ను సందర్శించలేదు. త్వరలోనే ప్రత్యేక కమిటీని వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. పిల్లర్లు ఎందుకు కుంగాయి? నిర్మాణ లోపమా? నేచర్ ఎఫెక్టా? కారకులు ఎవరు? అనే విషయమై టెక్నికల్‌గా ఎలాంటి విచారణ జరుగలేదు. కేవలం ప్రాథమిక విచారణ ఆధారంగానే ప్రాజెక్టుపై రాజకీయం చేస్తూ దీన్ని పక్కన పెట్టే కుట్రలకు ప్రభుత్వం తెరలేపింది.
కృష్ణా నదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అదేరోజు కాళేశ్వరంపై దండయాత్రకు పూనుకొన్నది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను పరిశీలించారు. మేడిగడ్డలో సమీక్ష నిర్వహించి, విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణకు ప్రత్యేక కమిటీ వేస్తామని ప్రకటించి విజిలెన్స్ విచారణతో కాలం గడుపుతున్నారు. అయినా, మళ్లీ కావాలనే సీఎం రేవంత్.. మేడిగడ్డకు తన మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధికార యంత్రాంగంతో దండయాత్రకు వస్తున్నారు. దీనిని బట్టి బరాజ్‌లపై రాజకీయ కుట్రలు ఏ మేరకు జరుగుతున్నాయో అవగతమవుతున్నది. ప్రాజెక్టు ఇంజినీర్లను మానసిక క్షోభకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నోడల్ అధికారిగా సుధాకర్‌రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలిగించిన ప్రభుత్వం కే సుధాకర్‌రెడ్డిని నోడల్ అధికారిగా నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుధాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని, మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలోనూ ఆయన పాత్ర ఉన్నదని, అయినా అతడికి మళ్లీ నోడల్ అధికారిగా బాధ్యతలు ఎలా అప్పగించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందడం వల్లే ఆ పగ్గాలు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించగా, ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు పరిస్థితిని పూర్తిస్థాయిలో వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రులు మంగళవారం ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రతేకంగా స్క్రీన్‌తోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మేడిగడ్డకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మేడిగడ్డను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.