హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): తమ గ్రామానికి వచ్చి తమ సమస్యలను ప్ర స్తావించకుండానే సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడంపై చెంచులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెంచు పెంటల్లో తాగునీటి సౌకర్యం, ఐటీడీఏ సౌకర్యం, డీఎఫ్‌వోకు అప్పగించిన పీవో స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ సీఎం ప్రకటిస్తారని ఆశించామని, తాను నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకొన్న ముఖ్యమంత్రి నల్లమల చెంచు బిడ్డలకు సంబంధించిన ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపకుండానే ప్రసంగం ముగించార ని చెంచుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన సీఎం, చెంచు సమస్యల ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. చెంచుల కోసం పెట్టిన సభలో చెంచుల సమస్యలు, పరిష్కారాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేశంలోని ముచ్చట్లన్నీ తెచ్చి తమకు చెప్తే ఏం లాభమని చెంచులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ‘డీఎఫ్‌వో సారునే పీవో సారుగ పెడితే ఆయన ముమ్మలను ఎప్పుడు ఇక్కడి నుంచి బయటికి పంపిద్దామా? అని చూస్తున్నడు. మాకిన్ని నీళ్లు పోయాలన్న ఆలోచనే చేయడం లేదు. సీఎం సారు డీఎఫ్‌వోను తీసేసి, చెంచు పెంటలకు మంచి నీళ్లు తెస్తరని అనుకుంటే ఏదేదో మాటలు చెప్పిండు. మా బాధల గురించి ఒక్క మాట మాట్లాడలేదు’ అని చెంచు పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లమలలో ఆదివాసీ చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెంచు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్, సార్లపల్లి వీటీడీఏ అధ్యక్షుడు గురువయ్య తదితరులు నిర్ణయించుకున్నారు. 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేసి అమ్రాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఎం సభ ముగిసే వరకు వారిని ఠాణాలోనే నిర్బంధించారు. వారి అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఫోన్లో పరామర్శించారు. సీఎంను కలవడానికి ప్రయత్నించిన అమాయక చెంచు బిడ్డలను రేవంత్‌రెడ్డి అరెస్టు చేసి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎకడికకడ చెంచులను ముందస్తు అరెస్టులు చేసి, చెంచు ఉద్యమ నాయకులను నిర్బంధించి నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించడమే ప్రజాపాలనా?’ అని ప్రశ్నించారు.
ఠాణాలోనే సీఎం ప్రసంగాన్ని యూట్యూబ్ ద్వారా విన్న చెంచు సంఘం నేతలు.. తమ సమస్యల పరిష్కారం కోసం మరో సమరానికి సిద్ధమవుతామని చెప్పారు. మన్ననూర్ ఐటీడీ ఏ కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకు చెంచు మహా పాదయాత్రను కొనసాగిస్తామని ప్రకటించారు. తమ క ష్టాన్ని వివరిస్తూ యాత్ర కొనసాగిస్తామని చిగుర్ల మల్లికార్జున్, గురువయ్య, పద్మ ప్రకటించారు.
చెంచుల జీవన స్థితిగతులు, సమస్యలు, అకాల మరణాల మీద సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకావిష్కరణ సభకు 2016లో అప్పటి మంత్రి హరీశ్‌రావు మన్ననూర్ వచ్చారని, ఆ సందర్భంగా ఆయన చెంచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చిగుర్ల మల్లికార్జున్ గుర్తుచేశారు. అప్పటి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి తమకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చామని, కేసీఆర్‌తో మాట్లాడి పట్టాలిచ్చేలా ఒప్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
హామీ మేరకు కేసీఆర్ ప్రభుత్వం 2021లో నల్లమలలోని కోర్ ఏరియాలో 40 చెంచు పెంటలకు కలిపి 600 ఎకరాలకు పోడు పట్టాలిచ్చిందని, ఇది చెంచులకు దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. అటవీ హక్కుల చట్టంలోని యాజమాన్యపు హక్కు కింద నల్లమలలోని దాదాపు వెయ్యి కుటుంబాలకు ఉమ్మడి ఆస్తిగా భూమి లభించిందని మల్లికార్జున్, గురువయ్య చెప్పారు. ఇప్పుడు ఆ భూములను దున్నకుండా డీఎఫ్‌వో అడ్డుపడుతున్నారని వాపోయారు. పోడు భూములను ఎద్దులతో మాత్రమే దున్నాలనే షరతుపెడుతున్నాడని, ఇదే అంశాన్ని తాము హరీశ్‌రావుకు వివరించామని చెప్పారు. భవిష్యత్తులో తాము చేయబోయే మహా పాదయాత్రకు హరీశ్‌రావు మద్దతు కోరుతామని తెలిపారు.