సూర్యాపేటటౌన్, జూలై 16 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి.. ఉద్యమ నేత, పేదల పక్షాన పోరాడే నాయకుడు జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం నీతిమాలిన చర్యకు నిదర్శనమని అన్నారు.
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపి దేశంలోనే అత్యధిక దిగుబడి సాధించి ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చిన ఘనత జగదీశ్రెడ్డిదేనని కొనియాడారు. దాదాపు 20నెలలుగా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ సర్కార్ అని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పీ అన్నపూర్ణ పాల్గొన్నారు.