హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శాతం (దాదాపు రూ.53 వేల కోట్ల) రుణాలు తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తాజాగా మరో రూ.2,100 కోట్ల అప్పు కోసం రిజర్వు బ్యాంక్‌కు ఇండెంట్ పెట్టింది. ఈ నెల 18న నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకుంటామని ప్రతిపాదించింది. ఇందులో 26 ఏండ్ల కాలపరిమితితో రూ.1,100 కోట్లు, 27 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.1,000 కోట్లు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ తెలియజేసినట్టు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన కాంగ్రెస్ ప్రభు త్వం.. ఈ నెల 11 నాటికే రూ.52,900 కోట్ల అప్పులు తీసుకున్నది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 98 శాతానికి సమానం. మూడో త్రైమాసికం (క్యూ-3)లో రూ. 9,600 కోట్ల రుణాల కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రేవంత్‌రెడ్డి సర్కారు.. అం దులో భాగంగా అక్టోబర్ 14న రూ.1,000 కోట్లు, ఈ నెల 4న రూ.1,000 కోట్లు, ఈ నెల 11న రూ.1,000 కోట్ల రుణం తీసుకున్నది. ఈనెల 18న రూ. 2,100 కోట్ల రు ణం కోసం ఇండెంట్ పెట్టింది. అంటే వార్షిక రుణ సమీకరణ లక్ష్యానికి మించి అదనంగా రూ.1,000 కోట్లు అప్పు చేయబోతున్నది.
