హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఇక నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్డే సందర్భంగా టీజీ న్యాబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడతాయని, గంజాయిని గమనించినా, డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా క్షణంలో పట్టేస్తాయని చెప్పారు. యువతే ‘నో డ్రగ్స్’కు వారధులుగా మారాలని కోరారు.
స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలే బాధ్యత వహించాలని, వారిపైనా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ఇటీవల మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడితే పరిశ్రమ నుంచి పంపించేలా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అటువంటి చొరవ రావాలని ఆకాక్షించారు. ఒక తండ్రిగా మన రాష్ట్రం గురించి ఆలోచించాల్సి వస్తున్నదని నటుడు రాంచరణ్ అన్నారు. డ్రగ్స్ విషయంలో యువత చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని నటుడు విజయ్‌దేవరకొండ సూచించారు. జీవితంలో హెల్త్, మనీ, సక్సెస్, రెస్పెక్ట్ చాలా ముఖ్యమని.. డ్రగ్స్ తీసుకుంటే అవన్నీ దూరమవుతాయని చెప్పారు. మన జీవితం పట్ల అమ్మానాన్నలు సగర్వంగా ఉండాలని సూచించారు.