హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డు)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతున్నదో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డాటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ యూనిఫైడ్ కార్డులో ఆరోగ్యశ్రీ, సీఎం సహాయనిధి, ఫీజు రీయింబర్స్మెంట్, కార్మికశాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని స్పష్టంచేశారు. అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చేలా ఆలోచించాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సూచించారు.