RS Praveen Kumar | మంచిర్యాల, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మంచిర్యాల జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ కోసం పేదల భూములు ఎట్ల గుంజుకుంటరు? నోటిఫికేషన్ ఇవ్వకుండా, జీవోలు రాకుండా బెదిరించి సంతకాలు తీసుకోవడం ఏంటీ? దళితులను బెదిరించి భూ ములు లాక్కుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కే వస్తుంది? ఇందుకు కారకులైన నాయకులు, అధికారులపై కేసులు పెట్టాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డి మాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు, ముల్కల్ల గ్రామాల్లో 276.09 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులను మంగళవారం ఆయన పరామర్శించారు. ముల్కల్లల్లో భూ ములు కోల్పోయే రైతులతో మాట్లాడి.. ఏం జరిగింది? బెదిరించి సంతకాలు తీసుకున్నది ఎవరు? అనే వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆర్ఎస్పీ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మాలలు, మాదిగలు, బీసీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ఎవరైనా కావచ్చు, వాళ్ల భూములను దౌర్జన్యంగా గుంజుకోవడం సరికాదని అన్నారు. వారసత్వంగా వచ్చిన భూములు, గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చి న భూములను దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వంలో గుంజుకుంటున్నారని తెలిసి తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్నదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఫోర్త్‌సిటీ పేరిట హైదరాబాద్‌ను, ఫార్మాసిటీ పేరిట లగచర్లను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కు అని చెప్పి మంచిర్యాల పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు.
అక్కడ రేవంత్‌రెడ్డి, ఇక్కడ ప్రేమ్‌సాగర్‌రావు ప్రజాప్రతినిధులైనందుకు రియల్ ఎస్టేట్ వ్యా పారులు, తెలంగాణ ప్రజలు తలలు పట్టుకున్నారని అన్నారు. వీళ్ల పాలన త్వరలోనే అంతమైపోవాలని వేయి దేవుళ్లకు మొక్కుతున్నారని తెలిపారు. ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటే ఇక్కడేమో ప్రేమ్‌సాగర్‌రావు గూండా కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. లగచర్లలో రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ నాయకత్వంలో వీరోచిత పోరాటం చేశామని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడి వాళ్ల భూములు కాపాడినట్టు చెప్పారు. ఇలాంటి ప్రేమ్‌సాగర్‌రావులను మస్తు మందిని చూశామని, ఎవ్వరికి భయపడేది లేదని రైతులకు భరోసానిచ్చారు. రైతులు పరిహారం తీసుకోకపోతే బలవంతంగా గుంజుకుంటామని బెదిరింపులకు పాల్పడటం వంద శాతం నేరమని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే హైకోర్టుకు లేదా సుప్రీం కోర్టుకెళ్తామని, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
‘పీఎస్ఆర్.. ఇండస్ట్రియల్ హబ్ పెట్టుకోవాలంటే నీ అనుచరులైన కాంగ్రెస్ లీడర్లు సతీశ్‌రావు, సంజీవ్‌రావు భూముల్లో పెట్టుకోవాలి. అదే రూ.13 లక్షల పరిహారం వాళ్లకే ఇచ్చి భూ ములు తీసుకోవాలి. అవసరమైన చిరాన్‌పోర్ట్ ఆస్తులు అమ్మి మీ అనుచరుల భూములు కొ నుగోలు చేయండి. ఇవ్వకపోతే గుంజుకోవాలి. పేద రైతుల వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని సూచించారు.