ఏటూరునాగారం/తాడ్వాయి, జనవరి 19 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వన దేవతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. సోమవారం సమ్మక్క-సారలమ్మ గద్దెల పైలాన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం ఎత్తు బంగారం సమర్పించేందుకు తులాభారం వేసుకున్నారు. చీర, సారెతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపైకి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు కంకణాలు కట్టి, నూతన వస్త్రాలు, మేడారం ప్రసాదాన్ని అందజేశారు. మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం పర్యటనను ముగించుకొని వెళ్లిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి పోటెత్తారు.