జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు మేం సిద్ధం. చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దు.
– రావిర్యాల పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ వైపు చంద్రబాబు ప్రాజెక్టులు కట్టి తీరుతామని చంద్రబాబు దబాయిస్తుండగా.. చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామంటూ రేవంత్ దేబరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి జలవివాదాల అంశాలపై స్పందించారు.
‘తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా? పరిషారం కావాలా? అని అడిగితే పరిషారమే కావాలని కోరుకుంటాను’ అని చెప్పారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్కు లేదని, రాజకీయాలకతీతంగా సమస్యల పరిషారం కోసం అందరూ సహకరించాలని కోరారు. ‘ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నా.
కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దు. అడ్డంకుల వల్ల మాకు కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్నది. మేం వివాదం కోరుకోవడం లేదు. పరిషారమే కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నాం’ అంటూ ఏపీ సీఎంను బతిమాలుకున్నారు. అంతేకాదు తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక రాష్ట్రం సహకారం అవసరమని, అందుకోసం పక రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు.