హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును తెలంగాణ లోకాయుక్త స్వీకరించింది. తన సోదరుడికి చెందిన కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించే విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు లోకాయుక్తను ఆశ్రయించారు. సుమారు రూ.200 కోట్ల విలువైన భూమి కేటాయింపు ప్రక్రియలో నిబంధనలు, అధికారిక విధివిధానాలు పాటించలేదని అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి తన కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థకు ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు రావడంతో అధికార దుర్వినియోగం, ప్రయోజనాల సంఘర్షణ, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు వంటి అంశాలను లోకాయుక్త పరిశీలించాలని బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, మంకెన కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కోరారు.
బీఆర్ఎస్ నేతలు సమర్పించిన ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించి కేసు నంబర్ 835/2026 కేటాయించింది. ఫిర్యాదులో పేరొన్న ఆరోపణలు, అందించిన ఆధారాలు, ప్రభుత్వ భూమి కేటాయింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. విచారణ సందర్భంగా భూమి కేటాయింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ఫైల్ నోట్లు, సంబంధిత శాఖల నిర్ణయాలు, భూమి విలువ, లబ్ధిదారు సంస్థ వివరాలు తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు, ఫిర్యాదులోని ఆరోపణలపై ప్రభుత్వం లేదా సీఎం కార్యాలయం నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉన్నది. లోకాయుక్త విచారణ ప్రారంభమైతే రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపు వెనుక నిర్ణయ ప్రక్రియ ఏంది? నిబంధనలు పాటించారా? కుటుంబ సంబంధం ఉన్న సంస్థకు ప్రయోజనం కల్పించారా? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.