తెలంగాణ బిడ్డలపై తరచూ దురహంకారాన్ని ప్రదర్శించే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. గురువారం పాలకుర్తి సభకు వచ్చిన సొంత పార్టీ కార్యకర్తలను బూటుకాళ్లతో తన్నారు. బూతులు తిడుతూ.. వాళ్లను తొక్కుకుంటూ వెళ్లారు.
Revanth Reddy | జనగామ, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అహంకార ధోరణి.. బలుపు చేష్టలతో మరోసారి రెచ్చిపోయారు. వేదిక మెట్లపై తనకు అడ్డుగా ఉన్న పార్టీ కార్యకర్తలను హీనంగా చూస్తూ బూటుకాళ్లతో తన్నుతూ పరుష పదజాలంతో మాట్లాడటంతో పార్టీ శ్రేణులు విస్తుపోయాయి. గురువారం జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతుంటే జిందాబాద్లతో అడ్డుతగిలిన ప్రజలను సైతం ఏకవచనంతో సంబోధిస్తూ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. సభ ముగిసిన తర్వాత వేదిక మెట్ల నుంచి కిందకు దిగుతుండగా కొందరు కార్యకర్తలు ఆయన కాళ్లను తాకేందుకు ప్రయత్నించారు.
దీంతో వారిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన రేవంత్ పక్కకు జరగండంటూ బూతులు తిడుతూ తన బూటుకాళ్లతో పలుమార్లు తన్నిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నది. అధికారం రాకముందే ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ తీరుపై పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాపార్టీ తెలుగుదేశం ఏజెంట్గా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి తెలంగాణ బిడ్డలపై ప్రదర్శించిన దురహాంకారాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ దొంగను పీసీసీ పీఠంపై కూర్చోబెడితే ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను కాలుతో తన్నుతారా? ఇంత బలుపా? ఇంత కండకావరమా? అధికారంలోకి రాకముందే ఇంతలా రెచ్చిపోతుంటే ఇక ప్రజలు కాంగ్రెస్ చేతికి రాష్ర్టాన్ని అప్పగిస్తే రౌడీల రాజ్యం, రాక్షస పాలన కాదా? అంటూ మండిపడుతున్నారు.
తెలంగాణ బిడ్డను కాలుతో తన్ని అవమానిస్తాడా? ఇదేం పార్టీ? ఆయనేం నాయకుడు? ఇట్లాంటి వాడి చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం గతి ఏం కాను? అంటూ పార్టీ సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం అడ్డగోలు కూతలు కూస్తున్న రేవంత్ తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లను దారిదాపుల్లోకి రాకుండా పెత్తనం చెలాయిస్తుండగా, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీ టికెట్లు దక్కకుండా అమ్ముకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి పార్టీకి పునాదిలాంటి కార్యకర్తల పట్ల ఇంత హీనంగా.. నీచంగా ప్రవర్తించిన తీరుపై నిరసన వ్యక్తమవుతున్నది.