Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకుంటున్నాడని అన్నారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడని తెలిపారు. మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేశారని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరే రాజీనామా చేయకుండా పారిపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి తన రాజీనామాను జిరాక్స్ పేపర్ మీద ఇచ్చారని పేర్కొన్నారు.
ఉద్యమ జ్నాపకాలను చెరిపివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ 14 ఏండ్ల పోరాటం, ఆమరణ దీక్ష భవిష్యత్ తరాలకు చెప్పాలని అన్నారు. లేకపోతే చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి మన అస్థిత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ తల్లిని మార్చారని, తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం తీసేస్తానని అంటాడని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయలేదని అన్నారు. మన అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ ఉద్యమానికి ఊతం ఇచ్చింది యూనివర్సిటీ విద్యార్థులే అని తెలిపారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థి నాయకులు ఎంతోమందికి కేసీఆర్ ఉన్నత పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ఇక్కడికి వచ్చిన వారీలో కూడా భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించే వాళ్లు ఉన్నారని తెలిపారు.
గతంలో అన్ని పథకాల్లో స్కామ్‌లు జరిగాయని కేసీఆర్‌కు అధికారులు చెప్పారని హరీశ్ రావు తెలిపారు. కానీ తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందని.. కాంగ్రెస్ నేతలపై పగబట్టుడు, లోపల వేయడం తన పనికాదని కేసీఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధే తన ధ్యేయమని చెప్పారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ బిడ్డలకే చెందేలా చేశారని అన్నారు. నియామకాల్లో లోకల్ రిజర్వేషన్లు తెచ్చారని అన్నారు. కేసీఆర్ రెండేళ్లు పోరాడి, రాష్ట్రపతిని ఒప్పించి 95 శాతం నియామకాలు తెలంగాణ ప్రజలకే దక్కేలా చేశారని తెలిపారు. అదే రేవంత్ రెడ్డి పాలనలో నిధులు ఢిల్లీకి, ఏపీకి వెళ్తున్నాయని అన్నారు. రేపటితరం యువకులుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.