హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): ‘బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయకోవిదులతో చర్చలు జరిపేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు’.. సీఎం 52వ సారి ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఇది. కానీ అక్కడ జరిగింది వేరు. సీఎం వెళ్లింది బీసీల రిజర్వేషన్ల కోసం కాదు, అష్టకష్టాలు పడుతున్న రైతులకు యూరియా తెచ్చి ఆదుకునేందుకు అంతకన్నా కాదు.. ఆయన వెళ్లింది ఓ జాతీయ న్యూన్చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి అక్కడికి వెళ్లగానే రిజర్వేషన్ల కోసం న్యాయనిపుణులతో చర్చ ల్లో తలమునకలు అవుతారని అనుకుంటే.. ఆయన ఇండియాటుడేకు ఇంట ర్వ్యూ ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఈ ఇంటర్వ్యూను రికార్డింగ్ చేశారని, రేపోమాపో ప్రసారం అవుతుందని సమాచారం. ఆ తర్వాతైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమో, యూరియా కోసమో కేంద్ర పెద్దలను కలుస్తారని భావిస్తే, ఆయన రాజకీయ భేటీలు మొదలుపెట్టినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయినట్టు సమాచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయ కోవిదులతో చర్చించేందుకు తాను, మంత్రులు ఢిల్లీకి వెళుతున్నట్టు సీఎం రేవంత్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తీరా ఢిల్లీలో జరిగిన న్యాయ నిపుణులతో భేటీకి డుమ్మా కొట్టినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ప్రముఖన్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీతో తదితరులతో భేటీ అయ్యారు.