హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక నిర్ణయాలు, పారదర్శకత లేని విధానాలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాలను నిలిపివేస్తూ, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ.. మరోవైపు రాహుల్‌గాంధీ కోసం భారత్ సమ్మిట్‌కు భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం వివాదాస్పదమవుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆర్థిక నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో డబ్బులు లేవంటున్న సీఎం.. మరోవైపు ఆర్థిక వృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడిన ఫార్ములా-ఈ రేస్ కార్యక్రమాన్ని తదుపరి కొనసాగించకుండా నిలిపివేశారు.
ఈ-కార్ రేస్ నిర్వహణ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల ఊతం లభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వృథా ఖర్చు అని ఆరోపించింది. అంతేకాకుండా ఈ-కార్ రేస్ నిర్వహణ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు బనాయించించింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తెచ్చిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎదురుదెబ్బగా విపక్షాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారత్ సమ్మిట్‌కు రూ.30 కోట్ల ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంపై ఆరోపణలొస్తున్నాయి. సమ్మిట్ కార్యక్రమం ద్వారా రాష్ర్టానికి రూపాయి ప్రయోజనం లేకపోగా, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రమోషన్ కోసమే దీనిని నిర్వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఖర్చుపై ఎలాంటి విచారణ లేదా దర్యాప్తు జరగకపోవడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా ఉన్నదంటున్న సీఎం రేవంత్.. ఒకవైపు ఆర్థిక ప్రయోజనాలు తెచ్చిన కార్యక్రమాలను రద్దు చేస్తూ, మరోవైపు పార్టీ ప్రమోషన్ కార్యక్రమాలకు భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం విమర్శలకు దారితీస్తున్నది.
భారత్ సమ్మిట్- 2025 కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీజీటీపీసీ) ఆర్టీఐ పిటిషన్‌కు చెప్పిన సమాధానం కూడా వివాదాస్పదమైంది. ‘భారత్ సమ్మిట్ నిర్వహణ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.45 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఇందులో మార్ 7 ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ ఏడాది మార్చి 28న రూ.15 కోట్లు, ఏప్రిల్ 10న రూ.14.45 కోట్లు చొప్పున చెల్లించినట్టు పేర్కొన్నది. అయితే, సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి పాల్గొన్నవారి సమాచారం, డెలిగేట్ ఖర్చులు, ఆహ్వానాలు, టెండర్లు, బాధ్యతలు నిర్వహించిన శాఖ/అధికారి వివరాలు ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన కరీంఅన్సారీ ఆర్టీఐ కింద సమాధానం కోరగా, తమ పరిధిలో ఈ అంశాలు లేవని టీజీటీపీసీ జవాబివ్వడం పారదర్శకత లోపాన్ని సూచిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచంలో హైదరాబాద్‌ను ఈవీ హబ్‌గా మార్చేందుకు ఈ-కార్ రేస్ నిర్వహించినందుకే మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఈ-కార్ రేస్‌ను 190 దేశాల ప్రజలు వీక్షించారు. నీల్సన్ నివేదిక ప్రకారం.. ఈ-కార్ రేస్ ద్వారా తెలంగాణ రాష్ర్టానికి రూ.700 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఎలక్ట్రిక్ వాహన కంపెనీల పెట్టుబడులు రూ.వేల కోట్లు వచ్చాయి. రూ.40 కోట్లు వృథా అయ్యాయని కేటీఆర్‌పై అక్రమకేసు పెట్టారు. మరి.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ప్రమోట్ చేసేందుకు జరిపిన భారత్ సమ్మిట్‌కు రూ.30 కోట్ల ప్రజాధనం ఖర్చుచేయడంపై విచారణ జరుగాలా? వద్దా? ఉద్యోగుల సమావేశంలో రాష్ట్రంలో డబ్బులు లేవన్న రేవంత్‌రెడ్డి సర్కారుకు భారత్ సమ్మిట్ నిర్వహణకు మాత్రం రూ.30 కోట్లు ఎలా వచ్చాయి?
-మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి