ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్దాస్కు కూడా ఆ జాబితాలో చోటు కల్పిస్తూ కేంద్రానికి పంపింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతంగా మారనున్న ప్రాజెక్టును బేషరతుగా వ్యతిరేకించకుండా, ఏకంగా చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు సిద్ధమవడం తీవ్ర దుమారం రేపుతున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు రేవంత్సర్కార్ సై అంటున్నది. అందుకు చర్చల కమిటీకి ఏకంగా అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన ఆదిత్యనాథ్దాస్కూ ఆ జాబితాలో చోటు కల్పించింది. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ తొలుత పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా గత జూలై 16న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై సీఎంల భేటీలో వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలన్న అంగీకారానికి వచ్చిన విషయం విదితమే.
ఇరు రాష్ర్టాలు తమ అధికారుల పేర్లను ప్రతిపాదిస్తే తామూ ఇద్దరు అధికారులను కేటాయించి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సైతం ప్రకటించారు. పేర్లు పంపాలని ఇరు రాష్ర్ర్టాలకు కేంద్రం ప్రత్యేకంగా ఆ వెంటనే లేఖలు రాసింది. ఏపీ ఇప్పటికే తమ రాష్ట్రం తరఫున అధికారుల పేర్లు కేంద్రానికి నివేదించింది. అదే సమయంలో తెలంగాణ సైతం అధికారుల పేర్లను పంపేందుకు సిద్ధమైంది. పేర్లను కూడా నాడే ఖరారు చేసింది.
అయితే కమిటీ ఏర్పాటు అంశంపై నాడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి, నీటిరంగ నిపుణులు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో వెనక్కితగ్గింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సైతం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును కుదించుకున్నది. ప్రాజెక్టును తాత్కాలికంగా బనకచర్లకు బదులుగా నల్లమలసాగర్‌కు పరిమితం చేసింది. అదేవిధంగా నాడు గోదావరి జలాల మళ్లింపునకు ఒప్పుకోబోమని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ తాజాగా గుట్టుగా కేంద్రానికి రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ జలహక్కులకు తీరని ద్రోహాన్ని తలపెట్టింది.
కమిటీలో ఆదిత్యనాథ్ దాస్..
బనకచర్ల ప్రాజెక్టు జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీకి రాష్ట్రం నుంచి ఏడుగురు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్దాస్తోపాటు, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్) శ్రీనివాస్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్ ఉన్నారు. అయితే ఈ కమిటీలో ఆదిత్యనాథ్‌దాస్‌కు ప్రభుత్వం చోటు కల్పించడంపై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతున్నది.
సర్కార్ తీరును తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు, రాష్ట్ర ఇంజినీర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాస్తవంగా ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించడాన్నే గతంలో రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆదిత్యనాథ్‌దాస్ నియామకం తెలంగాణ నీటిహక్కులకు గొడ్డలిపెట్టు అని గగ్గోలు పెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌ను ఏపీకి కేటాయించారు. తొలుత చంద్రబాబు హయాంలో ఐదేండ్లు, ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి సమయంలో చీఫ్‌సెక్రటరీగా పనిచేశారు. విరమణ పొందిన అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. మొత్తంగా గడచిన పదేండ్ల పాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఆ పదేండ్లలో తెలంగాణ నీటిహక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ కీలకంగా పనిచేశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కాళేశ్వరం, సమ్మక్కసాగర్ ఇలా ప్రతి ప్రాజెక్టునూ వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ అనేక లేఖలు రాశారు. కృష్ణా జలాల వాటాల విషయంలోనూ కొర్రీలు పెట్టారు. జగన్మోహన్రెడ్డి హయాంలో ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. ఢిల్లీలోనూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంతో అనేకవిధాలుగా పైరవీలు కొనసాగించారు. అలాంటి ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఏకంగా అదే ఇరిగేషన్‌శాఖకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై రాష్ట్ర ఇంజినీర్లు, సాగునీటి రంగనిపుణులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు.
కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ నీటి హక్కులకు తీరని విఘాతమని ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. తాజాగా మళ్లీ అదే ఆదిత్యనాథ్‌దాస్‌ను జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి ప్రతిపాదించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తెలంగాణ జలహక్కులను ఏపీకి తాకట్టు పెట్టడమేనని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జలనిపుణులు ఉన్నారని, వారిని పకనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం అందులో భాగమేనని తేల్చిచెప్తున్నారు.
తెలంగాణ హక్కులు ఏపీకి..
బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతుల్లేకుండానే, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి మరీ పీబీ లింక్ ప్రాజెక్టును ఏపీ చేపడుతున్నది. ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఏపీ సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణశాఖ, కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు, ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) బాహాటంగానే వ్యతికించాయి. ప్రాజెక్టు అసంబద్ధమని, అనేక సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తాయి. ముందుస్తుగా పొరుగు రాష్ర్టాల సమ్మతి తీసుకోవాల్సిందేనని, ఆ తర్వాతే అనుమతుల కోసం రావాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టులా పరిణమించనున్న పీబీ లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఓ వైపు లేఖలు రాయించి, మరోవైపు ఢిల్లీ వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కమిటీ ఏర్పాటుకు సంతకాలు పెట్టి వచ్చారు. దానిపై తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తున్నది. తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. తాజాగా ఇప్పుడు కమిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారుల పేర్లను కూడా పంపడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ సీఎం బాబుతో లోపాయికారి ఒప్పందంతోనే రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తున్నది. కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నా.. రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ప్రాజెక్టుపై ఏపీతో చర్చించేందుకు ఉత్సాహం చూపుతున్నది. పూటకో మాట.. రోజుకో లెక్క చెప్తూ వస్తున్నారు. చంద్రబాబును తానే చర్చలకు ఆహ్వానిస్తానని తొలుత రేవంత్‌రెడ్డే ప్రకటించారు. ఆ తర్వాత గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు తెలంగాణకు రాసిస్తే సరిపోతుందని, ఆ తర్వాత ఏపీ ప్రాజెక్టుకు అంగీకరిస్తామని వెల్లడించారు. విమర్శలు రావడంతో ప్రాజెక్టును అడ్డుకుంటామని ఆ తర్వాత ప్రకటించారు. కానీ ఇటీవల మళ్లీ రేవంత్‌రెడ్డి మాట మార్చారు.
వరద జలాల్లో లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత బురద ఉన్నదో? వరద ఉన్నదో? తేలుతుందని, ఎవరేం కట్టాలంటున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దామని ప్రకటించారు. న్యాయపరంగానే ఏపీ లింకు ప్రాజెక్టుపై పోరాడుతున్నామని నమ్మబలికారు. ఆ తర్వాతే ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో బాబుతో భేటీ అవడమేగాక కమిటీ ఏర్పాటుకు సంతకం పెట్టారు. ఆ భేటీలో నాడు లింకు ప్రాజెక్టుపై చర్చలే కొనసాగలేదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కానీ ఏపీ మంత్రి భేటీలో ప్రాజెక్టుపై చర్చ కొనసాగిందని, సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని ప్రకటించడంతో ఆ గుట్టురట్టయింది. దీంతో రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలని నాడే తేలిపోయింది. ఇప్పుడు నల్లమలసాగర్ ప్రాజెక్టుపై ఏకంగా కమిటీ ఏర్పాటుకు అధికారుల పేర్లను ప్రతిపాదించడంతో అది మరింత బలపడింది. ప్రాజెక్టుపై ఏపీ ముందుకు పోకుండా నిలువరించడం కన్నా బాబుకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకే రేవంత్‌రెడ్డి తహతహలాడుతున్నారని స్పష్టంగా తేలిపోతున్నది.
ఏపీ ప్రతిపాదించిన వారానికే..
కేంద్రానికి ఈ నెల 15న ఏపీ సర్కారు తమ రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించింది. కమిటీ కోసం సాంకేతిక నిపుణులుగా ఏపీ తరఫున 4 పేర్లను ప్రతిపాదించింది. ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జలవనరులశాఖ ప్రభుత్వ సలహాదారు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈని సాంకేతిక నిపుణులుగా ఏపీ పేర్కొన్నది. ఆ తర్వాత కేవలం వారానికే తెలంగాణ సర్కార్ సైతం కమిటీ కోసం అధికారుల పేర్లు ప్రతిపాదించడం గమనార్హం.
సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం: ఉత్తమ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం బనకచర్ల (పోలవరం-నల్లమలసాగర్)లింకు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ వేశామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 5న పిటిషన్ విచారణకు రానున్నదని తెలిపారు.