CM Revanth Reddy | మహబూబ్‌నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘా ల నేతల విమర్శల దాడితో సీఎంలో కదలిక వచ్చింది. 8 మందిని బలిగొన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాకపోవడాన్ని తప్పబట్టడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎట్టకేల కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం టన్నెల్ వద్దకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై సీఎం మౌనం దాల్చడం, ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆదివారం హుటాహుటిన సీఎం దోమలపెంటకు చేరుకున్నారు. సీఎం షెడ్యూల్లో ఈ పర్యటన లేకున్నా వనపర్తి జిల్లా పర్యటనను కుదించుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. సీఎంకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ దగ్గరుండి ఎస్ఎల్బీసీ సొరంగం మార్గానికి తీసుకువెళ్లారు. తొమ్మిది రోజులుగా చేపట్టిన సహాయ చర్యలను వివరించారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి ఫలితం కనబడటం లేదని తేల్చారు. సొరంగంలో టీబీఏం మిషన్ అడ్డంగా పడి ఉండడం, లోపలి నుంచి ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదని చెప్పారు. అనంతరం కంపెనీ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యలు మున్ముందు చేపట్టే చర్యలను సీఎంకు వివరించారు.
ముఖ్యమంత్రి అసంతృప్తి
8 మంది కార్మికులు శిథిలాల్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్ఐ బృందం గుర్తించినా ఫలితం కానరావడం లేదని సీఎం రేవంత్‌కు అధికారు లు వివరించారు. ప్రతిపక్షాల నుంచి వస్తు న్న విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యామని, ఎన్ని బృందాలు పనిచేస్తున్నా ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రు లు, అధికారులపై సీఎం అసంతృప్తిని వ్యక్తంచేశారు. సహాయ చర్యలు ఆలస్యం కావడానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను కనీసం మందలించకపోవడం గమనార్హం.
మోదీ ఇచ్చింది రెండే ఉద్యోగాలు: సీఎం
ప్రధాని మోదీ తెలంగాణలో కేవలం రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణకు మంజూరు కావాల్సిన అభివృద్ధి పనులకు కేంద్రం ఆటంకాలు కల్పిస్తుందని విమర్శించారు. ఆదివారం ప్రజాపాలన-ప్రగతిబాట పేరుతో వనపర్తిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మా ట్లాడారు. తెలంగాణకు నిధుల మంజూరుపై ప్రధాని సానుకూలంగా ఉన్నా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయిష్టంగా ఉన్నారని ఆరోపించా రు. వరంగల్‌కు తాను కష్టపడి ఎయిర్‌పోర్టు తెస్తే.. కాదు నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ప్రసంగించే అవకాశం దక్కలేదు. సీఎం తన ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసాలు పూర్తిగా వేశామని చెప్పడం గమనార్హం. అధికారిక నోట్లో మాత్రం ప్రసంగించేవారి జాబితాలో చిన్నారెడ్డి పేరు ఉండటం గమనార్హం.
500 గ్యాస్‌పై మహిళల రియాక్షన్.. రాలే రాలే
ఆరు గ్యారెంటీల అమలును ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఆ వెంటనే సభలోని మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు. లేదు.. లేదు.. అంటూ చేతులు అడ్డంగా ఊపారు. అడ్డంగా ఊపిన మహిళల చేతులు వీడియోల్లో కనబడకుండా వెంటనే టీవీలను పక్కకు తిప్పారు. 98 జీవో అంశంపై శ్రీశైలం ముంపు బాధితులు ప్లకార్డులను ప్రదర్శించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళాశక్తి పథకం, రేవంతన్న భరోసా పథకాలను సీఎం ప్రారంభించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ధనసరి అనుసూయ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.