CM Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): ఎవరేమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకించినా సరే ఆక్రమణదారులను నిర్మూలిస్తామని, మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని అందించే జంట జలాశయాల్లోకి చుట్టూ ఉన్న ఫామ్‌హౌస్‌ల నుంచి మురుగు వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. లేక్‌వ్యూ ఫేస్‌తో చెరువుల పక్కనే కొందరు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని, వరద నీరు ప్రవహించాల్సిన నాలాలపై ఇల్లు, అపార్ట్మెంట్లు వెలిశాయని, అలాంటివారందరికీ హైడ్రా భయం పట్టుకున్నదని పేర్కొన్నారు.
చెరువుల, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే హైడ్రాను తీసుకొచ్చామని స్పష్టంచేశారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో ఏర్పాటుచేసిన హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు హైడ్రా కోసం కొనుగోలు చేసిన 21 డీఆర్ఎఫ్ ట్రక్స్, 55 స్కార్పియోలు, 4 ఇన్నోవా క్రిస్టా, 5 మినీబస్సులు, 37 ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం 122 వాహనాలను ప్రారంభించారు. అనంతరం హైడ్రా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తామని, అక్కడి ప్రజలు ఆ మురికి కూపంలోనే మగ్గిపోవాల్నా? అని ప్రశ్నించారు. చిన్న గాలి వాన వస్తేనే కాలనీలకు రోజుల తరబడి కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని, చెట్లు నేలకూలుతున్నాయని, కరెంట్ స్తంభాలు విరిగిపోతున్నాయని, వీటిని వెంటనే పునరుద్ధరించడానికి హైడ్రా పనిచేస్తున్నదని చెప్పారు.
రాష్ట్రంలో ఎలాగైనా రియల్‌ఎస్టేట్‌ను పెంచుదామనుకుంటే, నాలుగు వందల ఎకరాల్లో చెట్టన్నారు, పుట్టన్నారు, ఇంకేదో చెప్పి అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులను పంపి మూసీపై ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కా ర్యక్రమంలో హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డి ప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పాల్గొన్నారు.