హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న రుణభారం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఒక్కో వ్యక్తి తలపై రూ.17,873 అప్పు మోపగా.. అది మరింత పెరిగే అవకాశమున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్దేశించిన రూ.49,255 కోట్ల రుణాల పరిమితిని దాటిపోయే దిశగా రేవంత్రెడ్డి సర్కార్ సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచడానికి అవసరమైన సంసరణలను ప్రవేశపెట్టాలని, అవసరమైతే సంస్థాగత పునర్నిర్మాణం గురించి ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి తాజాగా అధికారవర్గాలను ఆదేశించినట్టు తెలిసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణాల అంచనా క్యాలెండర్ ప్రకారం రేవంత్ సర్కారు 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.13 వేల కోట్లు, రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.18,500 కోట్లు రుణం పొందింది. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,500 కోట్ల రుణాలను తీసుకున్నది. మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) ముగిసే నాటికి ఒక్క ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలే రూ.40,849 కోట్లకు చేరుకోనున్నాయి.
మూడో త్రైమాసికంలో ఆరు విడతల్లో మరో రూ.7,400 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అక్టోబర్ ఒకటిన రూ.2000 కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకున్నది. ఇక, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) నాటికి రూ.9,000 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఇంకా సగం మంది రైతులకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ కానేలేదు. వానాకాలం సీజన్ ముగిసినా రైతులకు రైతుబంధు ఇవ్వనేలేదు.
పెండింగ్లో ఉన్న పంట రుణమాఫీ కోసం రూ.13,000 కోట్లు, రైతుబంధు కోసం మరో రూ.7,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఉద్యోగులకు ఐదు డీఏ బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఇందుకు వార్షికంగా రూ.1,500 కోట్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రజలపై అదనపు పన్ను భారం మోపేందుకు సర్కారు సిద్ధమవుతున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పేర్కొన్న ఆదాయ లక్ష్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 33 శాతమే సేకరించింది. దాంతో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్లు ఆదాయంగా పొందాలని అంచనా వేసింది, కానీ సెప్టెంబర్ నాటికి పన్నుల ద్వారా రూ.75,000 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం డిమాండ్ పెరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవడం ఏమిటి? అని సీఎం ప్రశ్నించినట్టు తెలిసింది.
ఆదాయ సేకరణలో లోపాలను గుర్తించాలని, అన్ని శాఖలు ఆదాయ సేకరణలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు సమాచారం. వార్షిక లక్ష్యాలను చేరుకోవడానికి వారాంతపు లక్ష్య ప్రణాళికలను రూపొందించాలని, పన్ను సేకరణ ప్రక్రియలో పారదర్శకత, సమగ్రతను పాటించాలని సూచించినట్టు తెలిసింది. అదనంగా ఆదాయ సేకరణను పెంచడానికి అవసరమైన సంసరణలను ప్రవేశపెట్టాలని, అవసరమైతే సంస్థాగత పునర్నిర్మాణం గురించి ఆలోచించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.