హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేలా చంద్రబాబు కుతంత్రాలతో పురుడుపోసుకున్న బనకచర్ల కృష్ణాజలాలకూ ఎసరు పెడుతున్నది. ఆరు దశాబ్దాలపాటు కృష్ణాలో తీవ్ర అన్యాయానికి గురై.. ఇప్పుడిప్పుడే బ్రిజేశ్ ట్రిబ్యునల్‌తో ఊపిరి పోసుకోవాలని తపిస్తున్న తెలంగాణ గొంతును శాశ్వతంగా నులమేందుకు సిద్ధమైంది. బాబు బనకచర్ల ప్రాజెక్టు నివేదిక లోతుల్లోకి పోతే సాగునీటి రంగంలో తెలంగాణకు చారిత్రక అన్యాయం పునరావృతం కానున్నదనేది స్పష్టంగా అర్థమవుతున్నది. అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టాలు.. రాజ్యాంగ బద్ధమైన ట్రిబ్యునల్స్.. వీటన్నింటినీ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు బనకచర్లను అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి కమిటీ రూపంలో సహకరిస్తుండటంతో తెలంగాణకు కృష్ణా-గోదావరి రెండు నదులూ దక్కకుండా పోయే ప్రమాదం పొంచి ఉన్నదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా సెక్షన్-3 కింద తెలుగు రాష్ర్టాల కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ కొనసాగుతున్న సమయంలో బనకచర్ల చిచ్చు రేపడమంటే.. తెలంగాణ నోట్లో శాశ్వతంగా మట్టి కొట్టడమేనని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ సర్కారు చారిత్రక ద్రోహంలో పాలుపంచుకుంటున్నది. ఒకరి సొంత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజా క్షేత్రంలోకి దూసుకెళ్లి.. బనకచర్లపై పొంచి ఉన్న ప్రమాదాన్ని విప్పిచెప్తూ సబ్బండవర్ణాల్లో చైతన్యాన్ని నింపుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్లో చర్చించి.. బనకచర్లను అడ్డుకునే దిశగా తీసుకునే స్పష్టమైన నిర్ణయాన్ని జనబాహుళ్యానికి బహిరంగ పరచాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఇటు గోదావరి.. ఇటు కృష్ణా..!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గోదావరిలో వరద/మిగులు జలాల తరలింపు అంటూ చేపట్టేందుకు సిద్ధమవుతున్న బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి రంగానికి మరణ శాసనాన్ని లిఖించనుందనే ఆందోళన రోజురోజుకీ పెరిగిపోతున్నది. చంద్రబాబు నోటి నుంచి కేవలం గోదావరిజలాల తరలింపు అని చెప్తున్నా.. ఈ ప్రాజెక్టు మాటున కృష్ణాజలాలనూ తన్నుకుపోయే భారీ కుట్ర దాగి ఉందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు నివేదికలో ఇదే అంశాన్ని పొందుపరిచినట్లుగా స్పష్టం చేస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి పోలవరం కుడి కాలువ, ఇతర నిర్మాణాల సామర్థ్యాలను పెంచుతున్న చంద్రబాబు.. ఏకంగా నాగార్జునసాగర్ కుడికాలువ సామర్థ్యాన్ని పెంచే పనులను సైతం అందులో చేర్చడం మరింత ఆందోళన కలిగించే పరిణామం. ఇప్పటికే పోతిరెడ్డిపాడు రూపంలో శ్రీశైలం జలాశయాన్ని చెరబట్టిన ఏపీ.. ఇకపై సాగర్‌లోని కృష్ణాజలాలనూ తెలంగాణకు దక్కకుండా కబళించనుందని స్పష్టం చేస్తున్నారు.
సాగర్‌నూ చెరబట్టే నయా కుట్ర
కృష్ణా బేసిన్లో వరద మొదలై.. కర్ణాటక దాటి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణమ్మ క్షణాల్లో జూరాల దాటి శ్రీశైలం వైపునకు పరుగులు తీస్తుంది. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఇది మినహా కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తీవ్ర అన్యాయం చేశారు. అదే సమయంలో తెలుగుగంగ రూపంలో పోతిరెడ్డిపాడు కాలువను మళ్లించుకుపోయిన ఏపీ.. ఇప్పుడు ఆ దోపిడీని ఏకంగా నదిని మళ్లించుకుపోయే స్థాయికి తీసుకువచ్చారు. కేసీఆర్ హయంలో పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సైతం చివరి దశకు తీసుకువచ్చినా… ఇప్పుడున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. దీంతో శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరదను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోతుంది. ఇందుకు తాజా కృష్ణాజలాల లెక్కలే ఉదాహరణ. ఇటీవలి వరకు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా 80 టీఎంసీలకు పైగా తరలించుకుపోతే… తెలంగాణ మళ్లించిన కృష్ణాజలాల పరిమాణం నేటికీ ఐదు టీఎంసీలు దాటలేదు. అది కూడా కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేయకపోతే మేమే ఆన్ చేస్తామంటూ బీఆర్ఎస్ హెచ్చరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల మొదలుపెట్టింది. ఇలా పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి చెరబట్టింది. ఇప్పుడు నాగార్జునసాగర్‌ను సైతం ఇక్కడి రైతాంగానికి దక్కకుండా చేసేందుకు చంద్రబాబు బనకచర్ల కుట్రతో తెలంగాణ గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.
వందల టీఎంసీల అదనపు నీటి నిల్వ…
సాగర్ కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్న చంద్రబాబు… బనకచర్లలో భాగంగా పెన్నా బేసిన్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా దాదాపు రెట్టింపు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బొల్లపల్లి రిజర్వాయర్‌ను 173 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నట్లు నివేదికలో చెబుతున్నా… క్షేత్రస్థాయిలో 200 టీఎంసీలు.. భవిష్యత్తులో 300 టీఎంసీల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు పెడుతున్నట్లు తెలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నోరు కొట్టి కృష్ణాజలాల్ని అవతల ఉన్న పెన్నా బేసిన్‌కు తరలిస్తూ 351 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించున్నారు. ఇప్పుడు బనకచర్ల రూపంలో మరో 300 టీఎంసీల అదనపు నీటి నిల్వను పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అంటే ఇటు గోదావరి… అటు కృష్ణా… రెండు నదులనూ మళ్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరి ఇదే జరిగితే తెలంగాణ ఎడారి కావడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ రిజర్వాయర్లలో నిల్వ చేసే నీళ్లు కృష్ణాజలాలు, గోదావరిజలాలా? అనేది తేల్చడం కష్టం. టెలిమెట్రీలు ఉన్నప్పటికీ… ఇప్పుడున్నవే సరిగా పని చేయడం లేదు. రెండు రాష్ర్టాల ఇంజినీర్లతో సంయుక్త సర్వే చేసి నీటి వినియోగాన్ని తేలుస్తామన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గత ఏడాదిన్నరగా ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా సాగర్ కుడి కాల్వను వెడల్పు చేయడమంటే అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉంటుంది. గత పదకొండు సంవత్సరాల అనుభవం చూస్తే కృష్ణా బోర్డు వాళ్ల భూభాగంలోకి వెళ్లి వాస్తవమైన నీటి లెక్కలు తేవడమనేది జరిగే పని కాదని స్పష్టమవుతుంది. అంటే బనకచర్లతో గోదావరే కాదు… ఎగువన శ్రీశైలం, దిగువన సాగర్‌లోని కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయిలో మళ్లించుకున్నా అడిగే దిక్కుండదు.
తెలంగాణ ఊపిరి పీల్చుకునే దశలో ఈ కుట్ర…
ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. గోదావరిలోని ప్రాణహితపై ప్రాజెక్టులు కట్టలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ రెండు కోణాల్లో తెలంగాణను ఒడ్డుకు పడేసేందుకు పదేండ్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకవైపు ప్రాణహితజలాలను వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు… సెక్షన్-3 కింద కృష్ణాజలాలను పంపిణీ చేయాలంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చివరకు కేంద్రం వినకుంటే సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా కృష్ణాజలాల పంపిణీకి సిద్ధమైంది. తెలంగాణకు కృష్ణాలో దక్కాల్సిన న్యాయమైన వాటా ఎంత? అసలు 299 టీఎంసీల కథేంది? ఇలా అనేక రూపాల్లో న్యాయవాదుల ద్వారా తెలంగాణ నీటిపారుదల శాఖ బలమైన వాదనలు వినిపిస్తున్నది. బ్రిజేష్ ద్వారా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కి… తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకుంటారనే ఆశ అందరిలోనూ కనిపిస్తున్నది. కానీ ఇలాంటి కీలకమైన దశలో చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును తెర మీదకు తీసుకురావడం… దానికి సీఎం రేవంత్‌రెడ్డి తలూపడమంటే ఈ రాష్ర్టాన్ని ఏం చేయదలుచుకున్నారనే ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతున్నది.
ట్రిబ్యునల్‌ను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు…
ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగబద్ద సంస్థల్ని సైతం అపహాస్యం చేసేలా చట్టాలను ఉల్లంఘించుకుంటూ పోతుంటే దానికి సీఎం రేవంత్‌రెడ్డి సహకరించడమేంది? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఒకవైపు రెండు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేష్ ట్రిబ్యునల్ కొనసాగుతున్నది. ఈ సమయంలో చంద్రబాబు సాగర్ కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి ఇష్టానుసారంగా జలాలను తన్నుకుపోతానంటే మరి ట్రిబ్యునల్స్ ఉండి ఎందుకు? అని పలువురు నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్దంగా ఏర్పడే ట్రిబ్యునల్ అవార్డులు అంటే సుప్రీం కోర్టు తీర్పుతో సమానం. నదీజలాల పంపిణీల్లో ట్రిబ్యునల్స్ కేటాయింపులకు మన రాజ్యాంగం అంత ప్రాముఖ్యతను కల్పించింది. కానీ అలాంటి ట్రిబ్యునల్‌ను సైతం ఉల్లంఘించి బాబు ముందుకుపోవడమం తీవ్ర ఆక్షేపణీయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒకవైపు గోదావరిలో మిగులు/వరద
జలాలను తరలించుకుపోతున్నానంటూ ఆయనకు ఆయన ప్రకటించుకొని బనకచర్ల ప్రాజెక్టు చేపడితే దేశంలో చట్టాలెందుకు? న్యాయస్థానాలెందుకు? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గోదావరి బేసిన్‌లోని రాష్ర్టాల మధ్య జరిగిన ఒప్పందాలకు బచావత్ ట్రిబ్యునల్ ఆమోదం తెలపడం తప్ప… ఏ ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీల కేటాయింపు? అనేది జరగలేదు. పైగా అసలు గోదావరిలో నీటి లభ్యతపై ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనమే జరగలేదు. అలాంటిది చంద్రబాబు బచావత్‌కు మించి మిగులు జలాలు ఉన్నాయని ఆయనకు ఆయన ప్రకటించి… అందులో నుంచి 200 టీఎంసీలు తీసుకుంటానంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశ్నించకుండా కమిటీకి ప్రతిపాదించడమంటే ఏపీ సీఎం తెలంగాణ జలాల్ని తాకట్టు పెట్టడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు కుట్ర అదేనా?
గోదావరి ట్రిబ్యునల్ వేయాలంటూ చంద్రబాబు కొంతకాలం కిందట కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఇప్పటివరకు బేసిన్‌లోని రాష్ర్టాల కేటాయింపులు ఏంది? ఎంత వాడుకుంటున్నారు? మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎంత? ఎవరికెంత? అని తేల్చాలనేది దాని సారాంశం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు లేఖపై బేసిన్‌లోని ఇతర రాష్ర్టాల అభిప్రాయాలు తీసుకొని ట్రిబ్యునల్ వేయాలి. అప్పటిదాకా చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ తరపున తన వాటాకు లోబడి వినియోగాన్ని చూసుకోవాలి. కానీ ఒకవైపు ఆయనే ట్రిబ్యునల్ వేయాలంటూ లేఖ రాసి… అది తేలకుండానే మరోవైపు మిగులుజలాలతో బనకచర్ల ప్రాజెక్టును చేపడతానంటే ఏమిటి అర్థం? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇందులోనూ భారీ కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు.
రెండు ట్రిబ్యునల్స్ తేలకముందే ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించి.. అటు పిమ్మట తాను ప్రాజెక్టులు కట్టుకున్నందున కేటాయింపులు చేయాలంటూ పట్టుబట్టడమే అసలు వ్యూహమని అంటున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే పెన్నా బేసిన్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు కింద చెబుతున్న సగం ఆయకట్టుకు ఇప్పటికే కృష్ణాజలాలు అందుతున్నాయి. అందుకే దానిని స్థిరీకరణ కింద చూపారు. ఇకముందు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఎలాగూ గోదావరిజలాలు అందుతున్నాయంటూ కృష్ణాలో మిగులు చూపి… ఆ మేరకు పోతిరెడ్డిపాడుకు అధికారికంగా ట్రిబ్యునల్ కేటాయింపులు చేసుకోవాలనేది చంద్రబాబు కుట్రగా పలువురు నిపుణులు అభివర్ణిస్తున్నారు.
కేంద్రానికైనా బాధ్యత ఉండాలి కదా!
ఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రయోజనాలు తాత్కాలికం… కానీ ప్రజా ప్రయోజనాలే అంతిమంగా భావించాలి. కానీ దశాబ్దాల పాటు సాగునీటి రంగంలో అన్యాయానికి గురైన తెలంగాణ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోణంలో ఆలోచించడం లేదు. ఒకవైపు చంద్రబాబు ట్రిబ్యునల్స్, చట్టాలు అన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సెక్షన్-3 కింద రెండు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై ట్రిబ్యునల్ కొనసాగుతున్న సమయంలో ఇది సరైందికాదని ఏపీ సీఎంకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. తాను మిగులుజలాలను తరలించుకుపోతాననని బాబు అంటే… అది బేసిన్‌లోని ఏడు రాష్ర్టాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేయాలి. ఇలా రాష్ర్టాలు ఎవరికివారు ప్రాజెక్టులతో జలాల్ని మళ్లించుకుపోతే ట్రిబ్యునల్స్ కేటాయింపునకు అర్థమేముంటుందని నిలువరించాలి. కానీ ఇవేవీ చేయకపోవడం ఒకవంతైతే… బనకచర్లపై చంద్రబాబు ఒక తీరుగ మాట్లాడితే, కేంద్ర మంత్రి ప్రకటన ఇంకోతీరుగ ఉంది.
సాగర్ కుడి కాల్వలో రోజుకు నాలుగు టీఎంసీలు…
ఎగువన శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు పది టీఎంసీల వరకు కృష్ణాజలాల్ని తరలించుపోయేందుకు పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్… దిగువన నాగార్జునసాగర్‌లో కూడా రోజుకు మరో నాలుగు టీఎంసీల తరలింపునకు పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టు నివేదికలోనే ఆ పనుల్ని పొందుపరిచారు. ప్రస్తుతం తెలంగాణ ఆయకట్టుకు నీళ్లందించే సాగర్ ఎడమ కాల్వ సామర్థ్యం 11వేల క్యూసెక్కుల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లందించే కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యం 22వేల క్యూసెక్కులు. అయితే చంద్రబాబు ఈ కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా 44వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. అంటే తెలంగాణ ఎడమ కాల్వ కంటే నాల్గింతల సామర్థ్యంతో కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోనుంది. దీంతో బనకచర్ల ప్రాజెక్టు అంటే కేవలం గోదావరిజలాలే కాదు… కృష్ణాజలాల్లోనూ తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసేదని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.
ఒకరి ద్రోహానికి తెలంగాణ నష్టపోవాల్నా?
ఒకవైపు చంద్రబాబు తెలంగాణకు గోదావరి… కృష్ణా… రెండు నదులనూ దక్కకుండా తన్నుకుపోవాలనుకుంటే నిలువరించాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం కమిటీని ప్రతిపాదించడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. తన ప్రాంత ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరించే ఆయన ద్రోహానికి తెలంగాణ నష్టపోవాల్నా? అని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమంటే కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు, మేధావులు ఇలా అందరి సమ్మేళనం. ఈ క్రమంలో తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతుందని తెలిసి బనకచర్లపై కమిటీ కోసం సీఎం సంతకం చేస్తే తెలంగాణ సమాజమంతా ఎలా ఊరుకుంటుందని అంటున్న్నారు. అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కచ్చితంగా బనకచర్లపై క్యాబినెట్ భేటీని ఏర్పాటు చేసి… పర్యవసానాలపై సమగ్రంగా చర్చించాలని జనం డిమాండు చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు బహిరంగపరచాలని అడుగుతున్నారు.