హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. రికార్డు స్థాయిలో అప్పులను సేకరిస్తున్నది. అలా రోజు రోజుకూ రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి దింపుతున్న రేవంత్రెడ్డి సర్కారు.. తాజాగా మరో రూ.6,000 కోట్ల అప్పు కావాలని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. సెప్టెంబర్ 2న నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని ఈ రుణాన్ని సేకరిస్తామని స్పష్టం చేసింది. ఇందులో 26 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 32 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 38 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.1500 కోట్ల అప్పు తీసుకుంటామని తెలిపినట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ రుణాల ద్వారా మొత్తం రూ.54,009 కోట్లు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన కాంగ్రెస్ సర్కారు.. తొలి 5 నెలల్లోనే రూ.39,900 కోట్ల అప్పు చేయబోతున్నది. ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక రుణ మొత్తంలో దాదాపు 74 శాతానికి సమానం.