హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరోవైపు భావిభారత పౌరులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కోసం దుబారా చేస్తుండటంపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఓవైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్మును ఆర్భాటాలకు ఖర్చు చేయడమేంటని విద్యావేత్తలు, రాజకీయవేత్తల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల బాగుకోసం ఆ నిధులు వాడినా బాగుండేదని, కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం బూడిదలో పోస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు విద్యార్థులు కలుషితాహారం బారిన పడి దవాఖానల పాలైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మెస్సీతో ఫుట్‌బాల్ ఆడే కలల్లో తేలియాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకేరోజు రెండు చోట్ల 66 మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురైనా కనీసం వారిని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా పట్టని సీఎం, ఫుట్ బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానం పెద్దలకు ఆహ్వానాలు అందించడంలో తలమునకలు కావడంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
సింగరేణి ప్రగతి కోసం కార్మికులు రేయింబవళ్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ జాతికి కరెంటు వెలుగులు అందిస్తున్నారు. ఇలాంటి కార్మికుల రక్తమాంసాలతో పోగయిన సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ సోకులకు వాడుతున్నది. కార్మికుల కష్టార్జితాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేస్తున్నది. అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ ఆడబోయే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి సంస్థతో ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేయించింది. క్రీడల అభివృద్ధి పేరిట రూ.10 కోట్ల నిధులను సింగరేణి నుంచి వినియోగిస్తున్నది. సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బును ఇష్టారాజ్యంగా వాడటాన్ని కార్మికలోకం వ్యతిరేకిస్తున్నది.
వాస్తవానికి సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రతి నెలా డీజిల్, వేతనాలు, సంస్థ నిర్వహణ ఖర్చుల కోసం సంస్థకు రూ.3 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఈ మేరకు ఆదాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంస్థ నిర్వహణకు ప్రతినెలా బ్యాంక్‌ల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ)పై ఆధారపడుతున్నది. అంటే తాత్కాళికంగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు సింగరేణికి రూ.23,311 కోట్లు బకాయిపడ్డాయి. డిసెంబర్‌కు ఇవి దాదాపు రూ.29 వేల కోట్లకు చేరాయి. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో మూడోవంతు మన రాష్ట్రమే వాడుకుంటున్నది. కానీ బకాయిలను మాత్రం చెల్లించడంలేదు.
ఇటీవలే బొగ్గు సరఫరాను నిలిపివేస్తామని ఏకంగా సింగరేణి హెచ్చరికలు జారీచేసింది. ఈ బకాయిలిప్పించాలని తరుచూ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరుతున్నా, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించడం లేదు. బకాయిలు విడుదల చేయాలని ఇటీవలే కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సంస్థకు భారీ ఎత్తున బకాయి ఉంటూనే, మరోవైపు ఉన్న నిధులను కూడా వాడుకుంటున్నది.
సింగరేణి సంస్థలో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగింది. పార్టీ ప్రయోజనాలు, ప్రజాప్రతినిధుల ఆడంబరాలకు సింగరేణి సంస్థకు చెందిన రూ.కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. ఏడాది కిందట రామగుండంలో ఓ సభ నిర్వహించగా, ఖర్చంతా సింగరేణి సంస్థ నుంచే పెట్టారట! ప్రభుత్వ పనులు, ప్రారంభోత్సవాలకు సంస్థ నిధులనే వాడుతున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ నియామకపత్రాల జారీ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల జేబులు నింపేందుకు సైతం సంస్థ సొమ్ములనే వాడినట్టు ఆరోపణలున్నాయి. రూ.147 కోట్ల డీఎంఎఫ్టీ ఫండ్స్‌ను ఇతరత్రా అవసరాలకు వాడారని చెప్తున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో వీధి దీపాలు, ఇతర సౌకర్యాలకు సింగరేణి నిధులు కేటాయించారని చెప్తున్నారు. వాస్తవానికి వీటిని మున్సిపల్‌శాఖ ఇవ్వాల్సి ఉండగా, సింగరేణి నిధులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు.
రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జాబ్‌మేళాలు నిర్వహించారు. వీటి నిర్వహించింది, ఖర్చులను భరించింది సింగరేణి సంస్థ కాగా తామే నిర్వహించినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 21న మధిరలో ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ జాబ్ మేళా నిర్వహించగా తామే నిర్వహించినట్టు సర్కారు పెద్దలు ప్రచారం చేసుకున్నారు. ఏప్రిల్ 27న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, మే 18న గోదావరిఖనిలో, మే 24న వైరాలో, అక్టోబర్ 26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్ 25న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో జాబ్ మేళా నిర్వహించారు. నిజానికి హుజూర్నగర్ సింగరేణి ప్రాంతం పరిధిలో లేదు. అయినా సింగరేణి సొమ్ములను తరలించి జాబ్‌మేళా నిర్వహించడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్యే పేరు ప్రతిష్టల కోసం జాబ్ మేళాల పేరిట సంస్థ నిధులను వాడుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దుబారాను తగ్గించి, తమ సొమ్మును తమకే వినియోగించాలని కార్మికులు కోరుతున్నారు.
హైదరాబాద్‌లో శుక్రవారం రెండుచోట్ల 66 మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురైనా కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఓవైపు పిల్లలు కలుషితాహారం బారిన పడి దవాఖానల పాలైనా సీఎం మాత్రం మెస్సీతో ఫుట్‌బాల్ ఆడే కలల్లో తేలియాడుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా పట్టని సీఎం, ఫుట్ బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానం పెద్దలకు ఆహ్వానాలు అందించడంలో తలమునకలు కావడంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రే పెద్దదిక్కు. ఇక విద్యాశాఖ మంత్రి అంటే పిల్లలందరికీ సంరక్షకుడు. వారి చదువులే కాకుండా మంచీ చెడ్డా చూసుకోవాలి. రాష్ట్రమే తొలి ప్రాధాన్యం కావాలి. ప్రజల క్షేమమే పరమావధిగా భావించాలి. ఓవైపు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని చెప్తూనే మరోవైపు ఫుట్‌బాల్ ఆట కోసం వందకోట్లు దుబారా చేస్తుండటం, ఇందుకు సింగరేణి సొమ్మును కూడా వాడుతుండటం, సర్కారు బడి పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఫుట్‌బాల్ ఆటలోనే మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణను చైనా, సింగపూర్‌తో పోటీ పడేలా చేస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పేద విద్యార్థులను మాత్రం దవాఖానల పాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం వారి జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫుట్‌బాల్ ఆటలు, విజయోత్సవాలు, సమ్మిట్లు అంటూ రూ.వందలాది కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి పేద విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఆలోచన కూడా రావడం లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
‘పిల్లలకు నాణ్యమైన అన్నం పెట్టడానికి డబ్బుల్లేవు? కానీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు మాత్రం కోట్లు తగలేస్తావా? పిల్లల ప్రాణాలంటే మీకు లెకలేదా? ఇది ప్రజా ప్రభుత్వమా? మజా ప్రభుత్వమా?’ అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అటు సీఎం హోదాలో రాష్ర్టాన్ని దివాలా తీయిస్తూ.. ఇటు విద్యాశాఖను చెరబట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.
సింగరేణి సంస్థ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దుబారా చేయడం బాగా పెరిగింది. కార్మికుల కష్టార్జితాన్ని రేవంత్ సర్కారు ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నది. కార్మికుల రక్తమాంసాలతో పోగుచేసిన రూ.పది కోట్లను ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం, సీఎం రేవంత్‌రెడ్డి విలాసాల కోసం ఖర్చు చేయడం దుర్మార్గం. కార్మికుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం ఖర్చుచేయాల్సిన నిధులను ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తున్నాం. సింగరేణి నిధులను కనీసం పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించినా బాగుండేది. ఇలా అర్భాటాల పేరిట బుడిదలో పోయడం ఏమాత్రం పద్ధతి కాదు. సర్కారుకు కార్మికులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి