హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో కొట్లాటల ఆనవాయితీ కొనసాగుతునే ఉన్నది. తాజాగా పార్టీలో మండల కమిటీల ఏర్పాటు చిచ్చు రగిల్చింది. నేతల అసంతృప్తితో గాంధీ భవన్ వేదికగా రచ్చ రచ్చ అయ్యింది. కమిటీల ఏర్పాటుకు వ్యతిరేకంగా పలు జిల్లాల నేతలు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చాంబర్ ఎదుట ధర్నా చేశారు. నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకరికొకరు వ్యతిరేక నినాదాలతో గాంధీ భవన్ కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది.
ఒక దశలో నాయకులు ఒకరిపై ఒకరు దాడి వరకు వెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఏకపక్షంగా మండల కమిటీల ఏర్పాటుపై పలు జిల్లాల నేతలు పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా, నచ్చిన వారినే కమిటీల్లో నియమించుకొన్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాల్లో మండల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఏర్పాటు వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా మునుగోడు, భువనగిరి, రంగారెడ్డి జిల్లా నేతల మండిపోతున్నారు.
ఈ జిల్లాలకు చెందిన నేతలంతా గురువారం గాంధీ భవన్‌కు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. మునుగోడులో తనకు తెలియకుండానే, తన మనుషులకు అవకాశం ఇవ్వకుండానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేశారని, వాటికే అధిష్ఠానం ఆమోదం తెలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. తమవారికి కమిటీల్లో ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు.
ఇక భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా కమిటీలను ఏర్పాటు చేశారని, ఆ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా గాంధీ భవన్లో ధర్నాకు దిగారు. పాత కాంగ్రెస్ నేతలని కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారని, ఇదేనా తమకు ఇచ్చే గుర్తింపు అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోనూ మండల కమిటీల ఏర్పాటు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కమిటీల్లో తమకు అన్యా యం జరిగిందంటూ పలువురులు గాంధీ భవన్లో రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మండల కమిటీల ఏర్పాటు గురించి తనకేమీ తెలియదని, ఏదైనా ఉంటే ఆ జిల్లా డీసీసీలతో, ఇతర కీలక నేతలతో మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువైంది.
ఈ మాత్రం చెప్పడానికి ఆయ న ఎందుకని, అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చెప్పడమేమిటని మండిపడుతున్నా రు. రేవంత్‌కు తెలియకుండా కమిటీలు ఏర్పాటు అవుతాయా? అని ప్రశ్నిస్తున్నా రు. రేవంత్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచే పాత కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మండల కమిటీల్లో వారి అనుచరులకు పదవులిచ్చి.. పాత నేతలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని విమర్శించారు. ఈ కమిటీలను తాము గుర్తించబోమని, మళ్లీ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.